బయోమెడికల్‌ డివైజ్‌ హ్యక్‌థాన్‌ వైబ్‌సైట్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి-మధురవాడ : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలోని స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ, గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చి (జిమ్‌సర్‌) సంయుక్త నిర్వహణలో బయోమెడికల్‌ డివైజ్‌ హ్యక్‌థాన్‌ (బయోమెడ్‌ భారత్‌-2024) నిర్వహిస్తున్నట్లు గీతం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ దయానంద సిద్దవట్టం తెలిపారు. దీనికి సంబంధించిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యరంగం అవసరాలను గుర్తించి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయంగా అభివృద్ధి చేయడానికి యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో ఈ హ్యక్‌థాన్‌ను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. దేశంలోని గుర్తింపు పొందిన విద్యా సంస్థలలో ప్రస్తుతం పూర్తి కాలపు అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు అభ్యసిస్తున్న వారు, పరిశోధక విద్యార్థులు (పి.హెచ్‌డి విద్యార్థులు ) ఈ హ్యక్‌థాన్‌ పోటీలలో పాల్గొనడానికి అర్హులని తెలిపారు. పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి గల విద్యార్థి బృందాలు ఈ ఏడాది డిసెంబర్‌ 15వ తేదీలోగా బయోమెడ్‌ భారత్‌-2024 వెబ్‌సైట్‌ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని, డిసెంబర్‌ 22వ తేదీన అర్హత సాధించిన జట్లను ప్రకటిస్తామని చెప్పారు. డిసెంబర్‌ 29వ తేదీన నిపుణుల పర్యవేక్షణలో బూట్‌ క్యాంప్‌ నిర్వహిస్తామని, 2024 జనవరి 26వ తేదీన జట్ల నుంచి తుది ఆలోచనలపై నివేదిక స్వీకరిస్తామని పేర్కొన్నారు. మార్చి నెల 1, 2 తేదీలలో వర్క్‌షాప్‌ నిర్వహించి ఫైనల్స్‌ విజేతలను ప్రకటిస్తామన్నారు. ఫైనల్‌ విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.లక్ష నగదు, తరువాతి స్థానాలలో నిలచిన వారికి రూ.50వేలు చొప్పున అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో గీతం ప్రోవైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావు, జిమ్‌సర్‌ డీన్‌ డాక్టర్‌ ఎస్‌పి.రావు, స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ డీన్‌లు ప్రొఫెసర్‌ సి.విజయశేఖర్‌, డైరక్టర్‌ ప్రొఫెసర్‌ నాగేంద్రప్రసాద్‌, సీనియర్‌ ప్రొఫెసర్‌ బి.రవికిషోర్‌, ఎమ్‌.బాలాకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. పూర్తి సమాచారంకోసం ష్ట్ర్‌్‌జూ://bఱశీఎవసbష్ట్రaతీa్‌.స్త్రఱ్‌aఎ.వసబ. సందర్శించాలని సూచించారు.

➡️