దేవస్థానం భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు

అనితకు చిత్రపటం అందజేస్తున్న అధికారులు

ప్రజాశక్తి – సింహాచలం, గోపాలపట్నం విలేకరులు

సింహాచలం దేవస్థానం భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడతామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పంచ గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యను సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేష్‌ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సింహాద్రి అప్పన్నను సోమవారం ఆమె దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ ఇఒ సింగాల శ్రీనివాసమూర్తి ఆలయ సాంప్రదాయ ప్రకారం సాదర స్వాగతం పలికారు. అనిత ముందుగా కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపం చుట్టూ ప్రదక్షిణం చేసి, స్వామి అంతరాలయంలోనూ, గోదాదేవి సన్నిధిలోనూ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిపారు, అనంతరం ఆస్థాన మండపంలో అర్చకులు వేదమంత్రాలతో ఆమెను ఆశీర్వదించారు. ఇఒ ఆమెకు శాలువతో సత్కరించి స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. దర్శనం అనంతరం అనిత స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మంత్రిగా స్వామివారిని దర్శనానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని, ఆలయ పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలు ఎంతో అదృష్టవంతులని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో దాడులు జరిగితే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని తెలిపారు. దీంతో భయం లేకుండా విచ్చలవిడిగా మహిళలపై దాడులు జరిగాయని అన్నారు. పోలీసులు ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయాలని అన్నారు. గతంలో జరిగిన ప్రతి సంఘటనపై చర్యలు తీసుకుంటామని, మహిళలకు అన్యాయం జరగకుండా అండగా ఉంటామని అన్నారు. ఆమె వెంట కుటుంబ సభ్యులతో పాటు స్థానిక టిడిపి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు.

 

➡️