‘రుషికొండ’ చుట్టూ సర్వత్రా చర్చ

Jun 18,2024 00:56 #Rushikonda buildings, #ysjagan
రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవనం

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్మాణం జరిగిన రుషికొండ భవనాలపై తాజాగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి నేతలు ఈ ‘కొండ’పై అనుమానాలు, పలు ప్రశ్నలు కురిపిస్తుండడంతో మళ్లీ వార్తల్లోకి రుషికొండ చేరింది. ఈ చర్చ రాష్ట్రానికే పరిమితం కాలేదు. దేశం, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదొక చర్చనీయాంశంగా మారిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. గతంలో దీని నిర్మాణం అంతా రహస్యంగా సాగడంతో చర్చకు ఆస్కారమిచ్చింది. ఇంతటి విలాసవంతమైన భవనాలను ఎలా వినియోగించాలి ? అసలేం చేయాలి ? అన్నదానిపై తాజాగా చర్చ నడుస్తోంది. పచ్చని కొండపై పర్యావరణ విధ్వంసం జరిగిందని, ఈ భవనాలను ఏం చేయాలన్నది ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిందని ఆదివారం మీడియాతో మాజీ మంత్రి, టిడిపి ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపిన విషయం తెలిసిందే. కూటమి అధినేతల పర్యటనల తర్వాతే దీనిపై నిర్ణయం అని ఆయన చెప్పుకొచ్చారు. వివాదం అవుతున్న కొండ ఎవరి అనుమతితో రూ.500 కోట్ల ఖర్చు అంటూ టిడిపి తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో సోమవారం పోస్టును షేర్‌ చేసింది. ‘జగన్‌ పేలస్‌ను కట్టించాడు. లోతైన దర్యాప్తు జరగాలి’ అంటూ టిడిపి పేర్కొనడం తెలిసిందే. అత్యంత హంగులతో విలాసవంతంగా 91 ఎకరాల రుషికొండపై 9.8 ఎకరాల్లో 7 బ్లాక్‌లను గత ప్రభుత్వం సుమారుగా రూ.500 కోట్లు వెచ్చించి నిర్మించింది. కొండ దిగువ నుంచి పైకి వెళ్లేటప్పుడు ఈ ఏడు సూపర్‌ స్ట్రక్చర్స్‌ వరుసగా వంకరగా కొండ చుట్టూ ఆహ్లాదపరుస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. దీని నిర్మాణం సందర్భంలో జగన్‌ సర్కారు 20 అడుగుల ఎత్తులో ప్రహరీ నిర్మించి ఎవ్వరినీ అటు వెళ్లనియ్యకుండా రహస్యం పాటించినందున అందరి దృష్టీ అప్పుడు, ఇప్పుడూ దీనిపై పడుతోంది. 7 సూపర్‌ స్ట్రక్చర్స్‌ ఏమిటి ?విజయనగర్‌ బ్లాక్‌, కళింగ, చోళ, పల్లవ, గజపతి, వేంగి, తూర్పు కనుమలు (గంగా) అనే పేర్లతో రుషికొండపై బ్లాక్‌లు ఏర్పాటు చేశారు. ఈ మొత్తం భవంతుల సముదాయాన్ని ఎపిటిడిసి చేపట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కట్టడాలుగా ఈ భవంతులను పలువురు అభివర్ణిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి సెమినార్లు, అంతర్జాతీయ వేదికలకు సైతం ఉపయోగించుకునేలా నిర్మాణం చేపట్టారు. జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానుల విధానంలో విశాఖే పరిపాలనా రాజధాని అని ప్రకటన చేశాక ఈ భవనాలను త్వరితగతిన నిర్మించిన సంగతి తెలిసిందే. దీన్ని కూటమి పార్టీలు జగన్‌ పేలస్‌ అంటూ పేర్కొంటున్నాయి. ఏదిఏమైనా భవనాల నిర్మాణాలు జరిగిపోయాయి కాబట్టి మంచికి ఉపయోగించాలని పలువురు కోరుతున్నారు.

 

➡️