రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల పర్యటన

Apr 12,2024 21:37

 ప్రజాశక్తి-విజయనగరం  : రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్మోహన్‌ మిశ్రా శుక్రవారం జిల్లాలో పర్యటించారు. ఆయనకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి స్వాగతం పలికారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు తీసుకున్న చర్యలు, సీజర్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్నికల శిక్షణ తదితర అంశాలను, తన ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ వివరించారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు కోటీ 54 లక్షల రూపాయల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలను ఎస్‌పి దీపిక వివరించారు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, తనిఖీలకు సంబంధించిన అంశాలను తెలిపారు. ఎన్నికల కంట్రోల్‌ రూమును పరిశీలకులు మిశ్రా సందర్శించారు. వివిధ విభాగాల పనితీరును, ఇప్పటివరకు అందిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలను కలెక్టర్‌ వివరించారు. ఎంసిఎంసి, కంప్లయింట్‌ సెల్‌, 24 గంటల కాల్‌ సెంటర్‌, సి విజిల్‌ తదితర విభాగాల పనితీరుపై మిశ్రా ఆరా తీశారు. పర్యటనలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఆర్‌ఓ ఎస్‌డి అనిత, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.మీడియా సెంటర్‌ను పరిశీలించిన అబ్జర్వర్‌ ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్‌లో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్మోహన్‌ మిశ్రా శుక్రవారం సందర్శించారు. వివిధ నియోజకవర్గాల మ్యాపులు, వాటిపై పొందుపరిచిన అంశాలను ఆయన తికలించారు. జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్‌పి దీపిక, జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, డిఐపిఆర్‌ఒ డి.రమేష్‌ ఇతర అధికారులు కూడా ఉన్నారు.

➡️