ఓటేయడం బాధ్యత

Apr 27,2024 22:38

మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికలాధికారి ముఖేష్‌కుమార్‌ మీనా
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
ప్రతి ఓటరు మే 13వ తేదీన జరిగే పోలింగ్‌లో తప్పక ఓటు వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా కోరారు. శనివారం స్థానిక బృందావన్‌ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ఓటరు అవగాహన కోసం ‘లెట్స్‌ ఓట్‌’ సంస్థ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతతో నిర్వహించిన 3కె వాక్‌లో ముఖేష్‌ కుమార్‌ మీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు కేవలం హక్కు మాత్రమే కాదని, బాధ్యత, కర్తవ్యం, నిబద్ధత అని అన్నారు. ఓటు హక్కు వినియోగించటం దేశం పట్ల మన విధి అన్నారు. ప్రభుత్వ పరిపాలనను మార్చేశక్తి ఓటుకు ఉందని, ప్రజల అబిష్టం మేరకే దేశ, రాష్ట్ర పాలనా ఏర్పాటు నిర్ణయించబడుతుందని తెలిపారు. దేశ పౌరులుగా యువతకు కోత్త దృష్టి కోణం ఉంటుందని, దేశ భవిష్యత్తు వారి భుజస్కందాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. అందుకే ఎన్నికల సంఘం ఎల్లప్పుడు యువతరాన్ని అన్నివిధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ ఎన్నికల పండుగ యువకుల భాగస్వామ్యం లేకుండా పూర్తి కాదన్నారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల పరిధిలోని దాదాపు 20 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ శాతం దేశంలో నమోదైన సగటు ఓటింగ్‌ శాతం 68 శాతం కంటే తక్కువుగా ఉందని తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి పట్టణాల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా వుందన్నారు.తీ సందర్భంగా లెట్స్‌ ఓట్‌ సంస్థ జాతీయ కన్వీనర్‌ కె.సుబ్బరంగయ్యతో కలసి ఎన్టీఆర్‌ సేడియం వద్ద మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతతో 3కె వాక్‌ను జెండా ఊపి ప్రారంభించారు. లక్ష్మీపురం, మధర్‌ థెరిస్సా విగ్రహం సెంటరు, కొరిటెపాడు, వెల్కమ్‌ హోటల్‌ మీదుగా తిరిగి ఎన్టీఆర్‌ స్టేడియం వరకు ప్రదర్శన కొనసాగింది. జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికలాధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌పి తుషార్‌ డూడీ, జెసి, మంగళగిరి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి రాజకుమారి, నగరపాలక సంస్థ కమిషనర్‌ కీర్తీ చేకూరి, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ ప్రఖార్‌ జైన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ (ట్రైనీ) పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ పాల్గొన్నారు.

➡️