పుచ్చకాయలు, తాటిముంజులతో పోషకాలు మెండు

May 11,2024 20:56

ప్రజాశక్తి-విజయనగరం కోట : రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు ఉపశమనం కోసం పుచ్చకాయలు, తాటిముంజులు, శీతల పానీయాల కోసం పరుగులు పెడుతున్నారు. దీంతో వాటి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ప్రకృతి వరప్రసాదం తాటి ముంజులతో అనేక ప్రయోజనాలు, ఎనలేని పోషకాలు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు వయసుతో సంబంధం లేకుండా అందరూ అమితంగా వీటిని ఇష్టపడతారు. శరీరంలో చక్కెర ఖనిజ ప్రమాణాలను సమతుల్యం చేస్తాయి. విటమిన్‌ బి7, విటమిన్‌ కె, సోలెబుల్‌ ఫైబర్‌, పొటాషియం కాలుష్యం విటమిన్‌ ఏ విటమిన్‌ సి, విటమిన్‌-డి, జింక్‌ ఐరన్‌ లతో పాటు న్యూట్రిషన్స్‌ ఉంటాయి. నీటి శాతం ఎక్కువ ఉండటంవల్ల వేసవిలో వేడి దెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి వీటిలో ఉండే అధిక నీటి శాతం శరీరం డిహైడ్రేషన్‌ బారిన పడకుండా చేసి శరీరానికి చలువను అందిస్తాయి. వీటిలో పొటాషియం సమద్ధిగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి అంతేకాకుండా శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వేసవిలో తాటి ముంజులును క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా లివర్‌ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటిలో ఉండే పోషకాలు జీర్ణ సంబంధిత సమస్యను తగ్గిస్తాయి. ఈనేపథ్యంలోనే తాటి ముంజులుకు గిరాకీ పెరిగిపోయింది.గత ఏడాది డజన్‌ ముంజులు ధర రూ.30 ఉంటే ఈ ఏడాది రూ.50 నుంచి రూ.60వరకు పెరిగి పోయింది. పుచ్చకాయలతో ప్రయోజనాలెన్నో…వేసవి తాపాన్ని దాహాన్ని తీర్చేందుకు అద్భుతమైన ఫలం పుచ్చకాయ. శరీరంలో వేడిని తగ్గించి చలువ చేస్తుంది. ముఖ్యంగా ఎండల తీవ్రతతో శరీరంలో వాటర్‌ లెవెల్స్‌ మాటిమాటికి తగ్గిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు వడదెబ్బ తగిలి కళ్ళు తిరిగి కింది పడి పోతుంటారు. చాలామందికి ఒక్కోసారి ప్రాణాపాయం సంభవి స్తుంటుంది. అందుకే శరీరంలో వాటర్‌ లెవెల్స్‌, షుగర్‌ లెవెల్స్‌ తగ్గిపోకుండా చూసుకోవాలి. పుచ్చకాయ తినడం వల్ల వివిధ రకాల పోషకాలతోపాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఎండాకాలంలో మన శరీరానికి కావలసిన పోషకాన్ని అందిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.

➡️