పెదకూరపాడుకు ఐటి పార్కు తెస్తాం

Apr 7,2024 00:23

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి/ సత్తెనపల్లి/క్రోసూరు : ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి పల్నాడు జిల్లా పెదకూరపాడు, సత్తెనపల్లిలో జరిగిన ప్రజాగళం సభల్లో పాల్గొన్నారు. సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాలకు పలు హామీలిచ్చారు. పెదకూరపాడులో ఐటి పార్కు తెస్తామని, ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం ఇస్తామని చెప్పారు. ప్రతి ఇంటికీ ట్యాప్‌ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. జాబ్‌ రావాలంటే బాబురావాలని యువకుల చేత నినాదాలు చేయించారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఉద్యోగం లేని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు. సంపద సృష్టించే పార్టీ టిడిపి అయితే రాష్ట్ర సంపదనను నాశనం చేసిన పార్టీ వైసిపి అన్నారు. సచివాలయం ఉద్యోగస్తుల ద్వారానే ఇంటికే పింఛన్లు అందిస్తామని, పింఛను మొత్తం రూ.4 వేలకు పెంచుతామని అన్నారు. ఈ ఏప్రిల్‌ నుంచి పెంచిన పింఛన్లు ఇస్తామన్నారు. జులైలో ఒక్కొకరికి రూ.3 వేలు అదనంగా ఇస్తామన్నారు. పెదకూరపాడులో టిడిపి నుంచిపోటీ చేసే అవకాశం కోల్పోయిన మాజీ ఎమ్మెల్సీ కొమ్మాలపాటి శ్రీధర్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావుపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇళ్లస్థలాల పేరుతో భూములు కాజేశారని, తెలంగాణ నుంచి మద్యం తెచ్చి విక్రయిస్తున్నారని, ఇసుకను దోపిడీ చేస్తున్నారని అన్నారు. తాను గెలిస్తే టిడిపిలోకి వెళతానని శంకరరావు చెప్పుకుంటున్నట్టు తన దృష్టికి వచ్చిందని నంబూరు శంకర్రావును టిడిపిలో చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నారు. ఎస్‌సి వర్గీకరణకు ఎన్‌డిఎ కట్టుబడి ఉంటుందని సత్తెనపల్లి సభలో అన్నారు. సుప్రీంకోర్టులో కేసు పరిష్కారం కాగానే ఎబిసిడిగా విభజనకు కృషి చేస్తామన్నారు. సత్తెనపల్లిలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే కొండమోడు-పెరేచర్ల రహదారి నిర్మాణం వెంటనే చేపడతామన్నారు. సత్తెనపల్లి- అచ్చంపేటలో రైల్వే గేటు వద్ద బ్రిడ్జినిర్మాణం, నకరేకల్లు అమరావతి రోడ్డునిర్మాణం, అమరావతి రాజధాని అభివృద్ధి చెందితే సత్తెనపల్లికి అన్నిసదుపాయాలు వస్తాయన్నారు. గుంటూరు, కృష్ణాజిల్లాల వారు అమరావతిని కాపాడుకోవాలన్నారు. రాజధాని వస్తే సంపద, ఉపాధి వస్తుందన్నారు. ప్రపంచంలోనే ఆదర్శ రాజధానిగా అమరావతిని అభివృధ్ది చేస్తామన్నారు. ఐకమత్యంగా ఆమరావతిని అభివృద్ధి చేసుకోవాలన్నారు.
సత్తెనపల్లి సభలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితోపాటు ఆయన కుమారుడు జంగా కోటయ్య, భూషణం చెన్నయ్య, హరీష్‌ తదితరులు టిడిపిలో చేరారు. చంద్రబాబునాయుడు వీరికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు, సత్తెనపల్లి నుండి కూటమి తరుపున ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, గురజాల అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. రాష్ట్ర గోల్డ్‌ బులియన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కపిలవాయి విజరు కుమార్‌ శనివారం టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో నరసరావుపేట పార్లమెంట్‌, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరా యలు, డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు. క్రోసూరు ప్రజాగళం సభలో విజరు కుమార్‌కు టిడిపి కండువా కప్పి పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. కపిలవాయి విజరు కుమార్‌తో పాటు ప్రముఖ న్యాయవాది చిన్నపరెడ్డి తదితరులు టిడిపిలో చేరారు. శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ గెలుపు కోసం చేస్తామన్నారు. విజరుకుమార్‌ ఇటీవల వరకు ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో సన్నిహితంగా మెలిగారు.

➡️