సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేస్తాం

May 2,2024 21:05

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న ఆనాలోచిత విధానాల వలన దేశంలో సాగునీటి రంగం అంతగా అభివృద్ధి చెందలేదని, నదుల అనుసంధానం వంటి విధానాలతో బిజెపి సాగునీటిరంగాన్ని అభివృద్ధి చేసేందుకు పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసిందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పార్వతీపురం మండలం వెంకంపేటలో పార్వతీపురం మన్యం జిల్లా బిజెపి అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. నీటివనరులను సంసరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, కనుక వర్షం నీటిని భూమిలో ఇంకించేందుకు, సముద్రాలలో వృథాగా కలిసిపోతున్న వందల క్యూసెక్కుల నీటిని నదుల అనుసంధానం ద్వారా ఒడసిపట్టడం వంటి కార్యక్రమాలను రాబోయే ఐదేళ్లకాలంలో నిర్వర్తిస్తామని అన్నారు. వ్యవసాయ రంగంలో చెరకు, మొక్కజొన్న, పత్తి, వంటి పంటలకు మద్దతు ధర కల్పించామని, రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునేందుకు అవకాశాలు కల్పించామని అన్నారు. విశాఖ నుంచి రాయపూర్‌ వరకు నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డు జాతీయరహదారి వల్ల విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు జీవనాడియైన పోలవరం ప్రోజెక్టును రాజకీయ కారణాల వలన ఆలస్యం చేసేసారని, పోలవరం ప్రోజెక్టు అందుబాటులోకి తీసుకురావడంతో ద్వారా ఆంధ్రప్రదేశ్‌తో పాటు, ఇతర రాష్ట్రాలకు ఎనలేని లబ్ది చేకూరుతుందని అన్నారు. వ్యయంతో కూడిన ఇటువంటి పనులన్నీ చేయడానికి కేంద్రంలో బలమైన, స్ధిరమైన అవసరమని అన్నారు. కార్యక్రమంలో ముందుగా అరకు ఎంపి అభ్యర్థి కొత్తపల్లి గీత, పార్వతీపురం టిడిపి అభ్యర్ధి విజయచంద్ర మాట్లాడారు. కార్యక్రమంలో సాలూరు టిడిపి నాయకులు ఆర్‌పి భంజ్‌దేవ్‌, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ద్వారపురెడ్డి శ్రీదేవి, బిజెపి నాయకులు సురగాల ఉమామహేశ్వరరావు, సొండి సంజీవి తదితరులు పాల్గొన్నారు.

➡️