అంతర్వేది ఉత్సవాలకు భారీగా జనం

కిక్కిరిసిన పంట్లు – నిబంధనలు గాలికి – అధికారుల చర్యలు నిల్‌

ప్రజాశక్తి – నరసాపురం

అంతర్వేది తిరనాళ్లకు నరసాపురం మీదుగా మాధవాయి పాలెం పంటి నుంచి పెద్ద ఎత్తున యాత్రికులు వెళ్తున్నారు. సోమవారం రాత్రి స్వామివారి కళ్యాణం, మంగళవారం స్వామివారికి రథోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో నరసాపురం మీదుగా ఏలూరు, కృష్ణా జిల్లా నుంచి పెద్ద ఎత్తున యాత్రికులు అంతర్వేదికి ప్రయాణమయ్యారు. పంటి వద్ద సచివాలయ, పోలీస్‌, అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తొక్కిసలాట జరగకుండా క్యూలైన్లు బారికేడ్లు ఏర్పాటుచేశారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది హెల్త్‌ క్యాంప్‌లు బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, పంటి రేవు వద్ద ఏర్పాటు చేశారు. పంటి రేవు వద్ద గజ ఈతగాళ్లు లైఫ్‌ జాకెట్లతో సిద్ధంగా ఉన్నారు. ఆదివారం రాత్రి అడిషనల్‌ ఎస్‌పి వి.భీమారావు మాధవాయిపాలెం రేవును పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.నిబంధనలకు విరుద్ధంగా పంటుల్లో ఆటోలు, కార్లుసాధారణ సమయంలో కంటే అంతర్వేది కళ్యాణం, రథోత్సవం, పౌర్ణమి స్నానాల సమయంలో పంటుల్లో ఎక్కువ రద్దీ కనిపిస్తుంది. దానికనుగుణంగా అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో గతంలో పోలీస్‌, రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది కార్లను పంటులోకి అనుమతిచ్చేవి కాదు. గతంలో కార్ల రూటును స్టీమర్‌ రోడ్డులోని సబ్‌ జైల్‌ వద్ద మళ్లించేవారు. ఈ సంవత్సరం గతంలో కంటే భిన్నంగా పంటులో నుండి కార్లను పంపించేశారు. సోమవారం మధ్యాహ్నం నుంచి కార్ల అనుమతి అనధికారంగా పంపించి వేశారు. పాటదారులుకు అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పంటులో కార్ల నిలిపే ప్రదేశంలో ఇంకొంత పంటులో నిలవడానికి, గోదావరి రేవు దాడానికి అవకాశం ఉంది. తద్వారా నరసాపురం రేవు వద్ద రద్దీ తగ్గుతోంది. లైన్‌లో నిల్చునే వారికి సమయం కూడా ఆదా అవుతుంది. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా తగ్గుతుంది. అయితే అక్కడ నిర్వాహకులు ఈ విధంగా కాకుండా మనిషి కంటే కారు వెళ్తేనే ఎక్కువ ఆదాయం వస్తుందని కార్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పాటదారులు జేబు నింపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు సైతం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. పరిమితికి మించి పంటులో ఎక్కువ మందిని ఎక్కిస్తున్నారు. లైఫ్‌ జాకెట్లు కూడా ప్రయాణికులకు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడీిగా తనిఖీలు నిర్వహిస్తారు తప్ప మామూలు సమయాల్లో పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. నరసాపురం ఎంపిడిఒ వెంకటరమణ వివరణ కోరగా ఈ నెల 25వ తేదీ వరకూ పంటుల్లో కార్లకు అనుమతి లేదన్నారు. ఈ విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. కార్లకు అనుమతి ఎట్టి పరిస్థితుల్లో లేదని తెలిపారు.

➡️