అమరవీరుడు నాగయ్యవర్మ స్ఫూర్తితో ఉద్యమాలు

వర్థంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం
ప్రజాశక్తి – భీమవరం రూరల్‌
అమర వీరుడు నాగయ్య వర్మ, ఇతర అమరవీరుల స్ఫూర్తితో జిల్లాలో సిపిఎం ఉద్యమాలు నిర్వహిస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. భూ పోరాట యోధుడు, అమర వీరుడు, సిపిఎం నాయకుడు, వ్యవసాయ కార్మికోద్యమ నేత మైలా నాగయ్యవర్మ 53వ వర్థంతి స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యుల సమక్షంలో మంగళవారం నిర్వహించారు. నాగయ్యవర్మ చిత్రపటానికి ఆయన కుమారుడు రిటైర్డ్‌ జడ్జి మైలా రామ్మూర్తివర్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా బి.బలరాం మాట్లాడుతూ మైలా నాగయ్యవర్మ తోకతిప్ప గ్రామంలో ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి చిన్న నాటి నుంచే దేశభక్తి భావాలను, సామాన్య, పీడిత ప్రజల, పేదల పట్ల అనురాగాన్ని పెంచుకున్నారన్నారు. పేదల సమస్యలు పరిష్కారం కావాలని, పీడిత ప్రజలకు దోపిడీ నుంచి విముక్తి కావాలని, పేద ప్రజలకు, అట్టడుగు వర్గాలకు భూమి దక్కాలని పోరాడిన యోధుడు మైలా నాగయ్యవర్మ అని కొనియాడారు. ఆయన ఆశయానికి, నమ్ముకున్న సిద్ధాంతానికి అంకితమై తన ఉద్యోగాన్ని సైతం వదులుకుని, కుటుంబ సభ్యుల సహకారంతో పీడిత ప్రజల ఉద్యమానికి అంకితమయ్యారన్నారు. లోసరిగూట్లపాడు, తోకతిప్ప, కొత్తపూసలమర్రు, గంజాయి సొసైటీ, గరవళ్ల దిబ్బ, దొంగపిండి, నాగిడిపాలెం కలవపూడి ప్రాంతాల్లో ఉన్న వేలాది ఎకరాల బంజరు, అటవీ భూములు పెత్తందార్లు, భూస్వాములు అనుభవిస్తుంటే అవి భూస్వాముల సొత్తుకాదు పేదలకు దక్కితే వారి కుటుంబాల్లో వెలుగు నింపవచ్చని భూ పోరాటనికి సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం నాంది పలికాయన్నారు. ఈ భూ పోరాట ఉద్యమానికి నాగయ్యవర్మ ఎంతో ధైర్యసాహసాలతో, త్యాగంతో స్వయంగా నాయకత్వం వహించారన్నారు. ఈ పోరాటం ఫలితంగా వందలాది పేద కుటుంబాలకు భూమి దక్కిందన్నారు. కలవపూడి పెత్తందార్లు, భూ స్వాములు భూ పోరాటాన్ని సహించలేక కుట్రపూరితంగా చర్చలకని పిలిచి దారి కాచి దొంగ దెబ్బతీసి చంపారన్నారు. పేదలందరినీ ఐక్యం చేసి నాగయ్యవర్మ ఆశయాలతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్‌, వి.వాసుదేవరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి షేక్‌వలి, కార్యకర్తలు బొక్కా సత్యనారాయణ, త్రిమూర్తులు, ఒడుగు వెంకటేశ్వరరావు, వరలక్ష్మి, అప్పన్న పాల్గొన్నారు.

➡️