ఉండేదెవరు.. ఊడేదెవరు..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

అధికార పార్టీ ఎంఎల్‌ఎల్లో టిక్కెట్‌ టెన్షన్‌ వెంటాడుతోంది. నిన్నటి వరకూ ధీమాగా ఉన్నవారు సైతం టిక్కెట్‌ ఉంటుందో.. ఊడుతుందో అనే ఆందోనళలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80కుపైగా స్థానాల్లో మార్పు తథ్యమంటూ వైసిపి అధిష్టానం ఇప్పటికే సంకేతాలు పంపింది. కొన్ని స్థానాల్లో మార్పులు సైతం చేసింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుండగా వీటిలో 12 చోట్ల వైసిపి ఎంఎల్‌ఎలు ఉన్నారు. ఉన్న సిట్టింగ్‌ స్థానాల్లో సగం చోట్ల మార్పు తథ్యమనే చర్చ నడుస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారిని తప్పించి కొత్తవారిని బరిలోకి దింపేందుకు వైసిపి అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఏలూరు జిల్లాలో ఏడు స్థానాలకుగాను ఇప్పటికే చింతలపూడి, పోలవరం స్థానాల్లో మార్పులపై అధిష్టానం స్పష్టత ఇచ్చింది. చింతలపూడి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ ఎలిజాకు టిక్కెట్‌ లేదని స్పష్టత ఇవ్వగా, పోలవరంలో సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజును తప్పించి ఆయన భార్యకు టిక్కెట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. బాలరాజును తప్పించి ఆయన భార్యకు టిక్కెట్‌ ఇవ్వడంపైనా తీవ్ర చర్చ నడుస్తోంది. భార్యకు టిక్కెట్‌ ఇస్తే వ్యతిరేకత ఎలా పోతుందనే చర్చ జనాల్లో తీవ్రంగా కొనసాగుతోంది. ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు స్థానంలో కొత్తవారిని బరిలో దించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సరైన అభ్యర్థి దొరక్కపోతే వాసుబాబునే కొనసాగించాలనే లెక్కలు సైతం అధిష్టానం వేస్తున్నట్లు చెబుతున్నారు. ఏలూరు నుంచి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి ఆళ్ల నానికే అవకాశం ఉంటుందని చెబుతున్నప్పటికీ, మార్పుపై ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక పశ్చిమగోదావరి జిల్లాలో మూడు స్థానాల్లో మార్పులు తప్పవనే ప్రచారం సాగుతోంది. మార్పులు చేసే స్థానాల్లో ఆచంట, నరసాపురం, తాడేపల్లిగూడెం ఎంఎల్‌ఎల పేర్లు ఎక్కువగా విన్పిస్తున్నాయి. ఆచంట ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజును ఆచంట నుంచి తప్పించి పాలకొల్లు టిక్కెట్‌ ఇవ్వాలని ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇస్తే ఆచంట ఇవ్వాలని, లేకపోతే లేదని రంగనాథరాజు ఖరాఖండీగా చెప్పినట్లు సమాచారం. దీంతో రంగనాథరాజును మారిస్తే అక్కడ ఎవరిని నిలబెట్టాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. నరసాపురం ఎంఎల్‌ఎ ముదునూరి ప్రసాద్‌రాజు మార్చాలని ఆలోచనలు సైతం జరుగుతున్నట్లు సమాచారం. నరసాపురంలో నిలబెట్టేందుకు బలమైన అభ్యర్థి కోసం అధిష్టానం కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి కొట్టు సత్యనారాయణను మార్చి ఉంగుటూరులో నిలబెట్టాలనే ఆలోచన సైతం వైసిపి అధిష్టానం చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు జిల్లాల్లోనూ సగం స్థానాల్లో మార్పులు చేయాలనే ఆలోచనలో వైసిపి ఉన్నప్పటికీ బలమైన అభ్యర్థులు దొరక్క వెనక్కి ముందుక్కి ఊగిసలాడుతున్నట్లు తెలుస్తోంది. మార్పులు చేద్దామన్న పలు స్థానాల్లో కొత్త అభ్యర్థులు దొరకడం లేదనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఎంపీ స్థానాలకు అభ్యర్థులు దొరక్క వైసిపి అధిష్టానం మల్లగుల్లాలు పడుతుందని, ఇప్పడు ఎంఎల్‌ఎ స్థానాల్లోనూ అటువంటి పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. అధిష్టానం ఇస్తున్న లీకులు, సమాచారంతో సిట్టింగ్‌ ఎంఎల్‌ఎల్లో గుబులు నెలకొంది. టిక్కెట్‌ ఉంటుందా.. ఊడుతుందో తెలియడం లేదంటూ కార్యకర్తల వద్ద తమ అక్కసు వెళ్లగక్కుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ వైసిపి ఎంఎల్‌ఎల తుది జాబితాలో సిట్టింగ్‌ ఎంఎల్‌ఎలకు ఎవరికి అవకాశం ఉంటుందో.. ఎవరికి గుడ్‌బై చెబుతారో వేచిచూడాలి.

➡️