ఒక్క అంగన్‌వాడీని తొలగించినా తీవ్ర ప్రతిఘటనే

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

అంగన్‌వాడీల్లో ఏఒక్కరిని తొలగించినా తీవ్ర ప్రతిఘటన తప్పదని, వారి సమస్యలను తక్షణం పరిష్కరించకపోతే వైసిపి ప్రభుత్వం పతనం కావడం ఖాయమని సిపిఎం రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు బుధ, గురువారాల్లో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగాయి. వివిధ జిల్లాల నుంచి 65 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశాల్లో రాజకీయ, ప్రజా సమస్యలపై పలు తీర్మానాలు చేశారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ.బేబి, బివి.రాఘవులు సమావేశాల్లో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణకు దిశానిర్దేశం చేశారు. తొలిరోజు బుధవారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. మధ్యాహ్నం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ.బేబి, బివి.రాఘవులు మీడియాతో దేశ, రాష్ట్ర రాజకీయాలతోపాటు ప్రజాసమస్యలపై మాట్లాడారు. మధ్యాహ్నం రాష్ట్ర కమిటీ సమావేశాలు కొనసాగాయి. రెండు రోజులపాటు జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు గురువారం స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి వ్యతిరేక శక్తులను కూడగట్టి ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న బిజెపికి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపి, జనసేన మద్దతు పలకడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీలు రోడ్డున పడి 31 రోజులు గడుస్తున్నా సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వెంటనే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించి అంగన్‌వాడీలంతా సంక్రాంతి పండుగ జరుపుకునేలా చూడాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన ఫలితం అనుభవించాల్సి ఉంటుందన్నారు. అంగన్వాడీల సమ్మెపై ప్రజల నుంచి సానుభూతి ఉందన్నారు. 32 లక్షల మంది తల్లీ బిడ్డలకు రక్షణగా ఉంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టకు పోయి అంగన్వాడీలను చీల్చడం, అణిచివేయడం చేస్తే వైసిపికి రాజకీయంగా ఎదురుదెబ్బ తప్పదన్నారు. అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలూ కలిసి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ప్రతియేటా జనవరిలో జాబ్‌క్యాలెండర్‌ అంటూ ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. మెగా డిఎస్‌సి కోసం ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఏజెన్సీలో స్పెషల్‌ డిఎస్‌సి వేయడం లేదన్నారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలకు వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించడంతోపాటు 104, 108, ఆశాలు, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌, రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం రోజురోజుకీ ప్రజాదరణ కోల్పోతుందన్నారు. సంక్షేమ పథకాలతో ఓట్లు వస్తాయనుకుంటే చెల్లదని, అది వైసిపి రాజకీయ ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి ఎ.రవి, నగర కార్యదర్శి పి.కిషోర్‌ పాల్గొన్నారు.

➡️