ఓటరు నమోదు, తొలగింపు, మార్పులు త్వరగా చేపట్టాలి

జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి
ప్రజాశక్తి – కాళ్ల
ఓటరు నమోదు, తొలగింపు, జాబితాలో మార్పులు త్వరితగతిన భారత ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు పరిష్కరించాలని కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు. మండలంలోని బొండాడ గ్రామ సచివాలయంలో ఫొటోస్‌ సిమిలర్‌ ఎంట్రీస్‌ (పిఎస్‌ఇ), డెమోగ్రాఫికల్‌ సిమిలర్‌ ఎంట్రీస్‌ (డిఎస్‌ఇ) తొలగింపుల ప్రక్రియను కలెక్టర్‌ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి పి.ప్రశాంతి మాట్లాడుతూ డిసెంబరు తొమ్మిదో తేదీ తర్వాత అందిన ధరఖాస్తులు, అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ విషయమై ఓటరు రిజిస్ట్రేషన్‌ అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. ఫొటో సిమిలర్‌ ఎంట్రీస్‌, డెమోగ్రాఫికల్‌ సిమిలర్‌ ఎంట్రీసు ద్వారా ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదైన వివరాలు పరిశీలించి ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు పరిష్కరించాలన్నారు. ఓటరు రిజిస్ట్రేషన్‌ అధికారులు వారి నియోజకవర్గం డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని గుర్తించి వివరాలు పంపించాలని ఆదేశించారు. ఓటర్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు వారి పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలను స్వయంగా పరిశీలించి వాటిలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అనేది పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ టిఎ.కృష్ణారావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, బిఎల్‌ఒలు, విఆర్‌ఒలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️