కొనసాగిన ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మె

Dec 22,2023 20:47

భీమవరం రూరల్‌: సమగ్రశిక్ష అభియాన్‌ ఉద్యోగుల (ఎస్‌ఎస్‌ఎ) సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు ప్రభుత్వాన్ని కోరారు. ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మె శుక్రవారం మూడోరోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో విస్సాకోడేరు వంతెన వద్ద జరుగుతున్న సమ్మెలో వాసుదేవరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్‌ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల జెఎసి జిల్లా అధ్యక్షులు బావాజీ మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి, శ్రీనివాస్‌, సమగ్ర శిక్ష అభియాన్‌ యూనియన్‌ నాయకులు పిటి మాస్టర్‌ రాజేంద్ర, సిఆర్‌పి స్పందన పాల్గొన్నారు.

➡️