గొంతేరు డ్రెయిన్‌ తవ్వకాలు అడ్డగింత

Feb 7,2024 21:58

నష్టపరిహారం అందించాలని రైతుల ఆందోళన
ప్రజాశక్తి – మొగల్తూరు
గొంతేరు డ్రెయిన్‌ తవ్వకాలను బుధవారం రైతులు అడ్డుకున్నారు. మొగల్తూరు పంచాయతీ గరువుపల్లవపాలేనికి చెందిన పలువురు పేద మత్స్యకారులకు గ్రామంలోని గొంతేరు డ్రెయిన్‌ అవతల భాగం ముత్యాలపల్లి రెవెన్యూ పరిధిలో డ్రెయిన్‌ను ఆనుకుని భూములున్నాయి. ఈ డ్రెయిన్‌ తవ్వకాలకు సంబంధించి ముత్యాపల్లి రెవెన్యూ పరిధిలో 2013లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో సుమారు 45 ఎకరాలు భూ సేకరణ చేశారు. ఈ భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.12.50 లక్షలు పరిహరం అందించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ భూములు కోల్పోయిన వారిలో సుమారు 15 ఎకరాలకు సంబంధించి 24 మంది రైతులకు నాటి నుంచి నేటి వరకూ నష్టపరిహరం చెల్లించలేదు. అయితే భూములు కోల్పోయిన రైతుల ఆందోళనలతో సుమారు మూడేళ్ల క్రితం డ్రెయిన్‌ తవ్వకాలు మాత్రం ప్రభుత్వం డబ్బులిచ్చిన భూముల్లో మాత్రమే తవ్వకాలు పూర్తి చేసి డబ్బులివ్వని భూములను తవ్వకుండా వదిలేశారు. 15 ఎకరాలకు సంబంధించి రైతులు నష్ట పరిహరం కోసం జిల్లా కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, డ్రెయినేజీ అధికారుల చుట్టూ తిరిగినా వీరికి నేటికీ పరిహరం అందలేదు. బుధవారం డ్రెయిన్‌ తవ్వకాలను నష్టపరిహరం అందని రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తిరుమాని మార్రాజు, కర్రి స్వామి, మోకా శ్రీనివాస్‌, వెంకట్రాజు, అద్దంకి మల్లికార్జునరావు, కొల్లాటి బాబూరావు, బర్రి వీరాస్వామి, మామిడిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ సుమారు పదేళ్ల నుంచి నష్ట పరిహరం కోసం పోరాడుతున్నామని తెలిపారు.

➡️