తాగునీటి సమస్య తీర్చరా..?

మండల సమావేశంలో ఎంపిటిసి సభ్యులు హనుమ నిలదీత
ప్రజాశక్తి – ఆకివీడు
తమ గ్రామంలో శివారు ప్రాంతంలో ఉన్నవారికి ఎంతో కాలంగా మంచినీరు, వీధి దీపాలు లేవని, సమస్యలు పరిష్కరించరా అని జనసేన పార్టీకి చెందిన గుమ్మలూరు ఎంపిటిసి సభ్యులు హనుమ నిలదీశారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదే సమస్యపై ఎంతో కాలంగా ఎన్నో సమావేశాల్లో చర్చించారని, నేటికీ ఏ ఒక్కరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆవేదనకు ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ విలువ లేదా, ప్రజా సమస్య పట్టదా అంటూ ఆయన తన నిరసన వ్యక్తం చేశారు. సభా ప్రాంగణం మధ్యలో నేలపై కూర్చుని నిరసన దీక్ష ప్రారంభించారు. సమస్య పరిష్కరిస్తే తప్ప తాను కదిలేది లేదన్నారు. సమావేశం పూర్తయిన వెంటనే ఆ సమస్యపై చర్చిస్తామని, అవసరమైతే హాజరు అవుతామని హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించారు. సమావేశం అయిన అనంతరం ఎంపిపి, ఎంపిడిఒ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు వెళ్లి పరిశీలించారు. ఈ సమావేశానికి ఎంపిటిసి సభ్యులు, అధికారులందరూ హాజరు కాలేదు.

➡️