తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్‌ పరిశీలన

ప్రజాశక్తి – నరసాపురం టౌన్‌

సోమవారం మండలంలోని పెదమైనవానిలంక డిజిటల్‌ భవనం, పిఎంలంకలో సముద్రం కోతకుగురైన ప్రాంతాన్ని, చినమైనవానిలంక తుపాను షెల్టర్‌, వేములదీవి (తూర్పు) తుపాన్‌ షెల్టర్‌, బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌, కాలనీని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌ సుందర్‌ రెడ్డి, ఆర్‌డిఒ ఎం.అచ్యుత అంబరీష్‌, వివిధ శాఖల అధికారులతో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ స్థానికులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంత ప్రజలు అధికారులు సూచనల మేరకు పునరావాస కేంద్రాలకు చేరుకోవాలన్నారు. గర్భిణులను వెంటనే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రుల్లో చేర్పించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రంలో లోటుపాట్లు రాకుండా చూడాలన్నారు. నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. సముద్ర తీర ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. తుపాను కారణంగా జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. ఆమె సోమవారం నరసాపురం సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌లో జిల్లా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తుపాను ముందస్తు చర్యలపై సమీక్షించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి, నరసాపురం ఆర్‌డిఒ ఎం.అచ్యుత్‌అంబరీష్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం మండలాల్లో అత్యవసరంగా 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్‌ తెలిపారు. భారీ వర్షాల సూచనతో లోతట్టు, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను యుద్ధ ప్రాతిపదికన తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. తీర ప్రాంతాలైన ఆచంట, నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి మండలాల్లోని అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆమె ఆదేశించారు. పాలకొల్లు రూరల్‌: రైతులు ధాన్యాన్ని త్వరితగతిన రైసుమిల్లులకు తరలించాలని, కోతలు కోయని పైరును మరో మూడు రోజుల వరకూ కోయకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని వెలివెలలో బరకాలతో కప్పి ఉంచిన ధాన్యం రాశులను, కోతదశలో ఉన్న పంటలను జెసి ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చిందన్నారు. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ రైతులు తమ ధాన్యాన్ని భద్రపర్చు కోవాలన్నారు.

➡️