ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించాం

మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

ప్రజాశక్తి – తణుకు రూరల్‌

తుపాన్‌ నేపథ్యంలో కోసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన రైస్‌ మిల్లులకు తరలించినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఇరగవరం మండలంలో గోటేరు, కత్తవపాడు, అత్తిలి మండలంలో మంచిలి, కంచుమర్రు, స్కిన్నెరపురం, ఈడూరు, కొమ్మర, పాలూరు గ్రామాల్లో మంత్రి కారుమూరి పర్యటించి, రైతులతో మాట్లాడారు. ధాన్యంలో తేమశాతం తేడాను పరిగణలోకి తీసుకొని రైతుకు, మిల్లర్లకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. రైతులు పంపిన ధాన్యాన్ని మిల్లర్లు త్వరితగతిని అన్‌ లోడింగ్‌ అయ్యేలా చూడాలన్నారు. రైతులకు అండగా ప్రభుత్వం ఉందని, రైతులు అధైర్య పడొద్దని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇతర జిల్లాల రైస్‌ మిల్లులకు ధాన్యాన్ని తరలించే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రెండు జిల్లాల్లోని మెజార్టీ రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించారన్నారు. కృష్ణా జిల్లాలో రైస్‌ మిల్లులు తక్కువగా ఉండడంతో అక్కడ ధాన్యాన్ని పక్కన ఉన్న పల్నాడు, బాపట్ల ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ పెనుమత్స సుబ్బరాజు, కొత్తపాడు సొసైటీ అధ్యక్షులు పెనుమత్స రామభద్రరాజు, పార్టీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️