నిరాశ.. నిర్బంధం..!

ఓవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో వివిధ తరగతుల ప్రజల్లో నిరాశ.. ఆ హామీల అమలు కోసం నినదిస్తే నిర్బంధం. ఇదీ జిల్లావాసులు గడిచిన వారం రోజుల్లో ఎదుర్కొన్న అనుభవం. దెందులూరులో సిఎం ‘సిద్ధం’ సభ, రాష్ట్ర బడ్జెట్‌ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేయగా.. హామీల అమలు కోసం గొంతెత్తిన ఆశా వర్కర్లపై ప్రభుత్వ దమనకాండ, నిర్బంధం అందరినీ నివ్వెరపర్చింది. ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా అధికార పార్టీ వైసిపి ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల స్థాయి ‘సిద్ధం’ సభ ఏలూరు శివారు దెందులూరులో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఓ ప్రయివేటు స్థలంలో పెద్దఎత్తున నిర్వహించింది. జనసమీకరణ తదితర అంశాలు పక్కనబెడితే తమ పదవీకాలంలో చేసిన పనులన్నీ చెప్పి వాటినే ప్రచారం చేయాలని వైసిపి శ్రేణులకు జగన్‌ దిశానిర్దేశం చేశారు. కనీసం సభకు కేంద్రమైన నియోజకవర్గానికి సంబంధించిన కొల్లేరు అంశంపై కనీసం నోరుమెదపలేదు. సమీపాన ఉన్న ఏలూరులో బయటపడిన అంతుచిక్కని వ్యాధి గురించి ప్రస్తావనే లేదు. వీటన్నింటితోపాటు ఈ జిల్లా పరిధిలో ఉన్న పోలవరం నిర్వాసితులకు సంబంధించి చేసిందేమిటీ.. చేయబోయేదేమిటీ అనే ఊసే కరువైంది. వాళ్లు చేసింది చెప్పుకోవడమే తప్ప పెండింగు అంశాలకు సంబంధించి జనం వైసిపి శ్రేణులను నిలదీస్తే ఏం చెప్పాలనేది సిఎం జగన్‌ స్పష్టత ఇవ్వకపోవడంపై వైసిపి శ్రేణుల్లోనే కొంత గందరగోళం నెలకొందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ‘సిద్ధం’ అయ్యేది ఇలాగేనా అని ఆ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక రాష్ట్ర బడ్జెట్‌ జిల్లావాసులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వైసిపి ప్రభుత్వం తన పదవీకాలంలో ప్రవేశ పెట్టిన చివరి బడ్జెట్‌ మధ్యంతరమే అయినా కనీసం కొన్ని హామీల అమలుకు రాబోయే కాలంలో కేటాయింపులపైనా ప్రస్తావన లేకపోవడం అందరినీ నిరాశపర్చింది. పోలవరం నిర్వాసితులు, కొల్లేరు ప్రజలకు పునరావాసం, ఉపాధి, డెల్టా ఆధునికీకరణ, వాటర్‌గ్రిడ్‌, ఫిషింగ్‌ హార్బర్‌ వంటి అంశాలేవీ చర్చకు రాకపోవడంపై జిల్లావాసులు పెదవివిరుస్తున్నారు. చింతలపూడిలో ‘రా.. కదలిరా’ పేరిట చంద్రబాబు సభ ఆర్భాటంగా నిర్వహించగా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల దెందులూరు నియోజకవర్గంలో రోడ్‌ షో నిర్వహించారు. చంద్రబాబు సభ గతానికి భిన్నంగా నిర్దేశిత సమయానికి ప్రారంభం కావడంతో జనం హాజరు బాగానే ఉంది. అయితే చింతలపూడి, పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారేగాని సభ జరిగిన ప్రాంతానికి చెందిన చింతలపూడి ఎత్తిపోతల పథకంలో నిర్వాసితులైన రైతులకు పరిహారంపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం నిర్వాసిత రైతులను నిరాశకు గురి చేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనూ పరిహారం గురించి రైతులు ఆందోళన చేసిన విషయం గుర్తుకు తెచ్చుకుని టిడిపి, వైసిపి ప్రభుత్వాలు ‘దొందూ.. దొందే’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని రైతులు పెదవివిరుస్తున్నారు. షర్మిల ప్రధానంగా కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా సాగిస్తున్న ప్రసంగాలు, బిజెపి, వైసిపి ప్రభుత్వాలపై ఎక్కుపెడుతున్న విమర్శలు ఆ పార్టీకి ఓట్లు ఏ మేరకు తీసుకొస్తాయో చెప్పలేముగాని చర్చనీయాంశమవుతున్నాయని చెప్పొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పోలీసు శాఖ ప్రజా రక్షణకా.. పాలకుల రక్షణకా అనే చర్చ జిల్లాలో పెద్దఎత్తున సాగుతోంది. ఆ శాఖపై రాజకీయ ఒత్తిడి, ప్రభుత్వాల మౌఖిక ఆదేశాల ఒత్తిడి కొత్తేమీ కాదు. అయితే తాము గీసుకున్న లక్ష్మణరేఖ పరిధిలో పాలకులకు, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వారి ఆదేశాలను పాటించినా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కోసం నిరంతరం కృషి చేసేవారు. వైసిపి పాలనలో పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఏదైనా సమస్యపై ఉద్యమించేవారిని రోడ్డెక్కాక అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించడం చేసేవారు. ఈసారి అత్యంత నిరంశకుశపూరితంగా ఇళ్ల వద్దే అడ్డుకుంటున్నారు. అదేదో అధికారిక కార్యక్రమానికే అనుకుంటే పొరబడినట్లే. సిద్ధం సభ పూర్తిగా రాజకీయ సభ. ఆ సభలో పాల్గొనేందుకు సిఎం జగన్‌ వస్తున్నారనే పేరుతో నిరసనలు తెలుపుతారనే భయంతో సిపిఎం, సిఐటియు, రైతుసంఘం, ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నేతలను కార్యాలయాల్లో, ఇళ్ల వద్ద నిర్బంధించడం ఏమిటో అర్థంకాక మేధావులు, జనం సైతం ముక్కు మీద వేలేసుకున్నారు. ఇక ఆశాల చలో విజయవాడ నేపథ్యంలో పోలీసుల తీరు మరింత చర్చనీయాంశమైంది. ప్రభుత్వమే మానవత్వ విలువలు కోల్పోయిందనుకుంటుంటే పోలీసులు సైతం కనీస మానవత్వ విలువలు పాటించని పరిస్థితి ఈ సందర్భంగా కన్పించింది. నూజివీడులో సిఐ రైతుసంఘం నేతపై సాగించిన జులుం, దురుసు ప్రవర్తన పోలీసులా, అధికార పార్టీ ప్రయివేటు సైన్యమా అనే అనుమానం తలెత్తేలా చేసింది. అలాగే పలు పోలీసు స్టేషన్లు, ప్రయివేటు కళ్యాణ మండపాల్లో నిర్బంధించిన ఆశాలకు మధ్యాహ్నం సమయంలో కనీసం భోజనం అందించకపోవడం, మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులే ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పోలీసులే భక్షకులుగా మారితే ఇక మహిళలకు సమాజంలో ఆకతాయిలు, దుండగుల నుంచి ఎదురయ్యే సమస్యలేమిటో రెండు జిల్లాల్లో ఉన్న పోలీసు శాఖలో ఉన్నతాధికారిణులైన మహిళలకు తెలియదా అనే చర్చ సాగుతోంది. పైగా పేర్లు చెప్పకపోతే భోజనం చేయడం ఆపాలంటూ నూజివీడు సిఐ రంకెలు దేనికి తార్కాణమో చెప్పాలి. పోలీసులపై ఒత్తిడి ఉండొచ్చు. అయితే ఈ తరహా ప్రవర్తన ఎన్నడూ మాత్రం జిల్లావాసులు చవిచూడలేదు. ఇప్పటికైనా సదరు అధికారిపై చర్యలు చేపట్టకపోతే పోలీసు శాఖ ప్రతిష్ట మసకబారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని పరిశీలకులు ఘంటాపథంగా చెబుతున్నారు. -విఎస్‌ఎస్‌వి.ప్రసాద్‌

➡️