పంట నష్ట పరిహారం చెల్లించాలని ధర్నా

ప్రజాశక్తి – ఆచంట

మిచౌంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల హరేరామ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం వల్లూరు రైతుభరోసా కేంద్రం వద్ద ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హరేరామ్‌ మాట్లాడుతూ మిచౌంగ్‌ తుపాను వల్ల పంటనష్టం సంభవించి మూడు నెలలు దాటుతున్నా రైతులకు పరిహారం చెల్లించకపోవడం సిగ్గుచేటన్నారు. జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం సొమ్ము రూ.16 కోట్లకు పైగా రావాల్సి ఉండగా ఇప్పటికీ ఖాతాల్లో జమ చేయకపోవడం దారుణమని విమర్శించారు. రైతుభరోసా కేంద్రాలు పెట్టామని చెప్పడం తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. వరి, కొబ్బరి, ఆక్వా పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో రైతులు బోళ్ల సుబ్బారావు, కేతా రంగారావు, మారిమిల్లి సీతారాం, తంగెళ్ల నారాయణరావు, గుడాల సత్యనారాయణ, గుబ్బల వెంకటేశ్వరరావు, బోడ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️