పకడ్బందీగా సిఎం పర్యటన ఏర్పాట్లు : కలెక్టర్‌

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం లేని విధంగా పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. ఈ నెల 29వ తేదీ శుక్రవారం ముఖ్యమంత్రి భీమవరం పర్యటన నేపథ్యంలో మంగళవారం స్థానిక బైపాస్‌ రోడ్డులోని గ్రంధి వెంకటేశ్వరరావు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ వెనుక లేఅఔట్‌లో సభావేదిక, పార్కింగ్‌ ప్లేస్‌, లూథరన్‌ హైస్కూల్‌ హెలిప్యాడ్‌ను జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌, జిల్లా జాయింటు కలెక్టరు ఎస్‌.రామ్‌ సుందర్‌ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి పరిశీలించారు. సభాస్థలి, ముఖ్యమంత్రి బస్‌ కాన్వారు, మంత్రులు, శాసనసభ్యుల వాహనాలు పార్కింగ్‌ తదితర వాటిని క్షుణంగా పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి విద్యాదీవెన కార్యక్రమాన్ని భీమవరం నుంచి విద్యార్థులకు ఏటా ఇచ్చే ప్రభుత్వ సాయాన్ని కంప్యూటర్‌ ద్వారా బటన్‌ నొక్కి ప్రారంభిం చనున్నారని తెలిపారు. సుమారు 25 వేలకుపైగా ప్రజలు ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని, సుమారు 700 బస్సులు పార్కింగ్‌ చేసేందుకు పార్కింగ్‌ ప్రదేశాన్ని సిద్ధం చేయాలని పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ కె.శ్రీనివాసు లురాజు, ఇపిడిసిఎల్‌ ఇఇ ఫీర్‌ అహ్మద్‌ ఖాన్‌, జిల్లా ఆర్‌అండ్‌బి శాఖ అధికారి బి.లోకేశ్వరరావు, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి ఆర్‌సి ఆనందకుమార్‌ పాల్గొన్నారు.

➡️