పట్టణాల్లో త్వరలో బ్లూకోట్స్‌ : డిఐజి

ప్రజాశక్తి – పాలకొల్లు

పాలకొల్లు వంటి పట్టణాల్లో ఈవ్‌ టీజింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణకు బ్లూకోట్స్‌ వంటి వాహనాలతో పోలీసులు గస్తీ తిరిగే విధంగా చేస్తామని ఏలూరు రేంజ్‌ డిఐజి జివిజి అశోక్‌ కుమార్‌ చెప్పారు. ఆయన మంగళవారం పాలకొల్లు పట్టణ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ ఎస్‌ఐ రిక్రూట్మెంట్‌ జరుగుతోందన్నారు. త్వరలో కానిస్టేబుల్‌ నియామకాలు జరిగాక తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో పోలీసులు గంజాయి నియంత్రణకు ఉక్కుపాదం మోపడంతో కేసులు తగ్గాయని చెప్పారు. తరువాత స్టేషన్‌లో నేరస్తుల రికార్డులను పరిశీలించారు. ఆయనతో పాటు జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌, నరసాపురం ఇన్‌ఛార్జి డిఎస్‌పి, పట్టణ, రూరల్‌ సిఐలు డి.రాంబాబు, కుడుపూడి సతీష్‌, సర్కిల్‌లోని ఎస్‌ఐలు పాల్గొన్నారు. అనంతరం ఆయన క్షీరా రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మొగల్తూరు: సైబర్‌ నేరాల నివారణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించి 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్టు ఏలూరు రేంజ్‌ డిఐజి జివిజి అశోక్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం మొగల్తూరు పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కాలంలో సైబర్‌ నేరాగాళ్లతో చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారన్నారు. నేరం జరిగిన 2 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే త్వరితగతిన పరిష్కారం జరిగేందుకు వీలుంటుందన్నారు. ఆరు జిల్లాల్లో ప్రతి స్టేషన్‌లో సైబర్‌ నేరాలకు సంబంధించి ఇద్దరు సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాదిలో 343 కేసులు నమోదైనట్టు ఎస్‌ఐ ఎం.వీరబాబు తెలిపారు. అనంతరం మొగల్తూరు పోలీస్‌ కోటర్స్‌ పరిశీలించారు. ఆయన వెంట సిఐలు గోవిందరాజు, శ్రీనివాస యాదవ్‌, ఎస్‌ఐలు ఎం.వీరబాబు, గురవయ్య సిబ్బంది ఉన్నారు.

➡️