పిఠాపురం వైపు పవన్‌ చూపు..!

ప్రజాశక్తి – భీమవరం

జనసేన అధినేత కొణిదెల పవన్‌కళ్యాణ్‌ పోటీ చేసే అసెంబ్లీ స్థానంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భీమవరం నుంచి పవన్‌ పోటీ చేస్తారనే ప్రచారానికి తెరపడింది. భీమవరం మాజీ ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు మార్గం సుగమమైంది. పవన్‌ కళ్యాణ్‌ భీమవరం నుంచి పోటీ చేస్తారని ఆది నుంచి ప్రచారం సాగింది. దీనిలో భాగంగానే పవన్‌ ఇటీవల భీమవరంలో పర్యటించి టిడిపి ముఖ్య నేతలు, పట్టణ ప్రముఖులను కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ మళ్లీ భీమవరం నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే ఇటీవల టిడిపి, జనసేన అధినేతలు అభ్యర్థుల జాబితా వెల్లడించే సమయంలో జనసేన నుంచి ఐదుగురు అభ్యర్థుల పేర్లనే ప్రకటించారు. అందులో పవన్‌ పేరు ఎక్కడా రాలేదు. దీంతో పలు సందేహాలు నెలకొన్నాయి. విస్తృత కసరత్తు తర్వాత ఎట్టకేలకు పిఠాపురం నుంచే పవన్‌ చూపుతున్నట్లు తెలిసింది. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక తరగతుల ఓట్లు దాదాపు 91 వేలు ఉండటంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తే పవన్‌ భారీ విజయానికి ఢోకా ఉండదని జనసేన శ్రేణుల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పిఠాపురం నుంచి పోటీకి పవన్‌ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. దీంతో భీమవరం నుంచి జనసేన తరఫున అంజిబాబు పోటీ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నట్లు తెలిసింది. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

➡️