పెనుగొండలో కుంటుపడిన అభివృద్ధి

Mar 18,2024 22:47

పేరుకుపోయిన చెత్త
డ్రెయినేజీలు అస్తవ్యస్తం
పంచాయతీ కార్యదర్శి లేని వైనం
ఇబ్బందుల్లో ప్రజలు
ప్రజాశక్తి – పెనుగొండ
పెనుగొండ మేజర్‌ పంచాయతీలో కార్యదర్శి లేరు. సుమారు మూడేళ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ఎ గ్రేడ్‌ పంచాయతీ కార్యదర్శి లేకపోవడంతో గ్రామాభివృద్ధి కుంటుపడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శిస్తున్నారు. ఇన్‌ఛార్జి కార్యదర్శులు విధులను నిర్వహిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ కార్యదర్శి విధులు నిర్వహిస్తారో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఒక కార్యదర్శి ఒక పని చేపట్టాక మరో కార్యదర్శి రావడంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. కార్యదర్శి మారుతూ ఉండడంతో గతంలో ఏం జరిగిందో తమకు తెలియదని చెబుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. దీంతో సమస్యలు అలాగే ఉండిపోతున్నాయని వాపోతున్నారు. మేజర్‌ పంచాయతీ కావడంతో ఇక్కడ విధులు నిర్వ హించడం కష్టంగా మారిందని, కార్యదర్శి వచ్చిన కొంత కాలానికే ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. పంచాయతీ సర్పంచులకు, సభ్యులకు ఉన్న బేదాభిప్రాయాలు, ఒక పక్క నిలకడ లేని కార్యదర్శులతో అధిక ఆదాయం ఉన్న పంచాయతీలో ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో ప్రజా ప్రతినిధులు విఫలమవుతున్నారని విమర్శిస్తున్నారు. గ్రామంలోని అన్ని వీధుల్లో చెత్త పేరుకుపోతుందని, డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉంటున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. దోమల బెడద ఎక్కువగా ఉంటుందని, దీంతో తాము రోగాల బారిన పడతామని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేయడానికి కార్యదర్శులు ఉండడంలేదన్నారు. సుమారు 32 వేల జనాభా ఉన్నారని, మున్సిపాలిటీ స్థాయిలో పంచాయతీ ఆదాయాలు ఉన్నా మున్సిపాలిటీ అవ్వకపోవడం దురదృష్టకరమని స్థానికులు అనుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెనుగొండ ఎ గ్రేడ్‌ కార్యదర్శిని నియమించాలని కోరుతున్నారు.

➡️