పోటీ కార్మికులను తీసుకొస్తే ఊరుకోం

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఆదివారం ఆరో రోజుకు చేరింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ మున్సిపల్‌ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి జెఎసి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు నీలాపురాజు బంగారు వరలక్ష్మి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పోటీ కార్మికులను తెచ్చి రెచ్చగొట్టే చర్యలు చేపడుతోందని విమర్శించారు. వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని కోరారు. ధర్నాలో జెఎసి నాయకులు బి.వాసుదేవరావు, నీలాపు నాని, ఎన్‌.ధనలక్ష్మి, రాము, సత్యనారాయణ పాల్గొన్నారు. తణుకు రూరల్‌ : మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించమంటే పోటీ కార్మికులను పెట్టడం ఏంటని తూర్పు, పశ్చిమ గ్రాడ్యుయేట్‌ పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఆదివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద కొనసాగుతున్న సమ్మె 6వ రోజు చేరింది. మున్సిపల్‌ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం పోటీ కార్మికులను నియమించడంతో కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య కొంతసేపు ఘర్షణ జరిగింది. ఆ సమయంలో వచ్చిన ఎంఎల్‌సి ఐవి మాట్లాడుతూ గత పాదయాత్రలో మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు నిజం కాదా అని ప్రశ్నించారు. పర్మినెంట్‌ చేయాలని కార్మికులు కోరడం రాజ్యాంగ విరుద్ధమా అన్నారు. మాట తప్పను, మడమ తిప్పను అన్న జగన్‌ నేడు అన్నీ రివర్స్‌లో చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయనప్పుడు చివరిగా సమ్మె చేసే హక్కు ఉందన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ మాట్లాడుతూ ఇప్పటికైనా సమ్మె విచ్ఛిన్నం గురించి కాకుండా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం నుంచి బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్‌.ఆదినారాయణ బాబు, ఎ.కృష్ణబాబు, మందులయ్య, కె.అయ్యప్ప, జ్యోతి బాబు, సుధాకర్‌, రాజమ్మ, జి.కుసుమ, శ్రీనివాస్‌, కె.వెంకన్న, జి.లక్ష్మి, రాంబాబు పండు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️