పోలీస్‌స్టేషన్‌ ఎదుట మహిళ ధర్నా

సిఐ హామీతో విరమణ
ప్రజాశక్తి – ఉండిఉండి పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిలుకూరు గ్రామానికి చెందిన ఇజ్జని సువార్త, చిలుకూరు సంఘ సభ్యులు ఆదివారం రాత్రి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సువార్త మాట్లాడుతూ గురువారం తెల్లవారుజామున తాను చర్చికి వెళ్లి ప్రార్థన ముగించుకుని ఇంటికి వచ్చేసరికి దొంగలు ఇంట్లో చోరీకి పాల్పడ్డారని తెలిపింది. దీంతో పోలీస్‌స్టేషన్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయగా ఇంట్లో ఏమేమి వస్తువులు అపహరణకు గురయ్యాయో నిర్ధారణకు రావాలని, తాము తొమ్మిది గంటలకు వస్తామని పోలీసులు తెలిపారని చెప్పారు. తర్వాత వచ్చిన పోలీసులు ఇంటి సమీపంలోని సీసీ టివి ఫుటేజ్‌ పరిశీలించారన్నారు. సీసీ టివి ఫుటేజ్‌లో ఇద్దరు వ్యక్తులు కనిపించగా వారిలో ఒక వ్యక్తిపై తాను అనుమానం వ్యక్తం చేశానని సువార్త తెలిపింది. అయితే ఉండి పోలీసులు అనుమానితుడికి మద్దతు పలుకుతూ సంఘ పెద్దలకు ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగారన్నారు. దీంతో తాను, సంఘ పెద్దలు ఉండి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి వివరణ కోరగా వారు సమాధానం దాటవేయడంతో ధర్నాకు దిగాల్సి వచ్చిందని వాపోయింది. ధర్నాపై స్పందించిన సిఐ కెవివిఎన్‌.సత్యనారాయణ మాట్లాడుతూ సోమవారం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.రెండు నెలల నుంచి నియోజకవర్గ కేంద్రమైన ఉండి పోలీస్‌స్టేషన్‌కు ఎస్‌ఐ లేకపోవడంతో మండలంలో దొంగలు, జూదరులు రెచ్చిపోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఉండిలో శాంతిభద్రతలను పరిరక్షిస్తూ కోడిపందేలు, పేకాటలను అరికడుతున్న ఉండి పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ కె.గంగాధరరావును ఎన్నికల ముందు విఆర్‌కు పంపించడం వెనుక ఆంతర్యం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

➡️