బిజెపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ధర్నాలు

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

పార్లమెంట్‌పై జరిగిన దాడి ఘటనను, అసాంఘిక శక్తుల ప్రమేయాన్ని భద్రతా వైఫల్యాలను, లోపాలను ప్రశ్నించిన ఎంపిలను అప్రజాస్వామికంగా సస్పెండ్‌ చేయడం పార్లమెంట్‌ చరిత్రలోనే చీకటి అధ్యాయమని, సస్పెండ్‌ చేయాల్సింది నిలదీసిన ఎంపిలను కాదని మోడీ, అమిత్‌ షాలను, ఘటనకు బాధ్యలను అని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, ఫార్వర్డ్‌ బ్లాక్‌ జిల్లా కార్యదర్శి లంకా కృష్ణమూర్తి విమర్శించారు. అప్రజాస్వామికంగా పార్లమెంటు ఉభయ సభల్లో 146 మంది ఎంపిల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఇండియా వేదిక దేశ వ్యాప్త పిలుపులో భాగంగా భీమవరం కొత్త బస్టాండ్‌ వద్ద వామపక్షాలు, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ ఎంపిలను సస్పెండ్‌ చేయడం దారుణమని విమర్శించారు. ఘటనకు పాల్పడిన వారికి పాస్‌లు ఇచ్చిన బిజెపి ఎంపిపై చర్యల్లేవని, మొత్తం దాడికి మోడీ, అమిత్‌ షా లు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ మోడీ పాలనలో నియంతృత్వం పెరిగిపోయిందని, చట్టమంటే వారికి గౌరవంలేదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, బిజెపిని సాగనంపాలని డిమాండ్‌ చేశారు. ఫార్వర్డ్‌ బ్లాక్‌ జిల్లా కార్యదర్శి లంకా కృష్ణమూర్తి మాట్లాడుతూ పార్లమెంటులో జరిగిన దాడి బిజెపి కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్‌, మల్లుల శ్రీనివాసరావు, వైవి.ఆనంద్‌, సిపిఎం నాయకులు జెఎన్‌వి.గోపాలన్‌, బి.వాసుదేవరావు, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకులు దండు శ్రీనివాసరాజు పాల్గొన్నారు. తణుకు రూరల్‌:ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న బిజెపి ప్రభుత్వం గద్దె దిగాలని సిపిఎం పట్టణ కార్యదర్శి పివి.ప్రతాప్‌, సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, కాంగ్రెస్‌ పట్టణ కార్యదర్శి దిర్శిపో రామకృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక నరేంద్ర సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. పార్లమెంట్‌లో భద్రత ఎలా ఉందో కళ్లకు కనబడిందన్నారు. పార్లమెంట్‌ సభ్యులకు రక్షణ లేకపోతే, ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నామన వెంకటేశ్వరరావు, పి.అమ్మిరాజు, గార.రంగారావు, కామన మునిస్వామి, సిహెచ్‌.రామకృష్ణ, బొద్దాని మురళీకష్ణ, కడలి రామారావు, పట్టణ అధ్యక్షుడు ఆకుల సాయి, గౌస్‌ ఖాన్‌, కె.వెంకట్రావు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం : లోకసభను కాపాడలేని బిజెపి ప్రభుత్వం దేశాన్ని ఎలా కాపాడుతుందని సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మార్నిడి బాబ్జి తెలిపారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పోలీసు ఐల్యాండ్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నలుపురంగు దుస్తులు ధరించి, నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని విమర్శించారు. లోకసభలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ గూండాలు పొగబాంబులు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా ప్రతి పక్షాలు ఇండియా కూటమి నిరసనలు, ఆందోళనలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టి బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరెడ్ల రామకృష్ణ, జవ్వాది శ్రీను, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, నరమాల కృష్ణ, మేట్రెడ్డి రమణ, చిటికిన రాము పాల్గొన్నారు.ఆచంట : మోడీ పాలనలో దేశ ప్రజలకే కాదు ప్రజాప్రతిని కూడా భద్రత కరువైందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆచంట మార్కెట్లో బిజెపి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. అనంతరం గోపాలన్‌ మాట్లాడారు. దేశ పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 146 మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్‌ చేసి మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై దేశ ప్రజలంతా ఐఖ్యంగా తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు వద్దిపర్తి అంజిబాబు, ఎస్‌విఎన్‌.శర్మ, సిర్రా నరసింహమూర్తి, కుసుమే జయరాజు, మోహన్‌రావు పాల్గొన్నారు.పెనుగొండ : బిజెపి విధానాలను నిరసిస్తూ స్థానిక గోంగూర తూము సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కేతా గోపాలన్‌ మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌.వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, నాగిశెట్టి గంగారావు, మాదాసు నాగేశ్వరరావు, ఆవుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు : ఇండియా వేదిక దేశవ్యాప్త నిరసనలో భాగంగా స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి చిర్ల పుల్లారెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి కళింగ లక్ష్మణరావు మాట్లాడారు. ఈ నెల 13వ తేదీ దేశానికి చీకటి రోజు అని తెలిపారు. దేశంలో రాక్షస పరిపాలన కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో బి.నాగేశ్వరరావు, తేతల నాగిరెడ్డి, కరక వెంకట్రావు, కృష్ణ, బండారు శ్రీనివాసరావు, కె.నాగరాజు, మోర్చ రాజేష్‌, గిద్ద శ్రీను, అడపా ఆంజనేయులు పాల్గొన్నారు.

➡️