భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలి

ప్రజాశక్తి – తణుకు రూరల్‌

భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాని కోరుతూ పోస్ట్‌కార్డు ఉద్యమం చేస్తున్నట్లు ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ తెలిపింది. మంగళవారం తణుకులో ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ , బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోస్ట్‌ కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ ఉభయ జిల్లాల కార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ భూ హక్కు యాజమాన్య చట్టం 27ను రద్దు చేయాలని మూడు నెలల నుంచి న్యాయవాదులు పోరాటం చేస్తున్నా, హైకోర్టును ఆశ్రయించినా ప్రభుత్వంలో చలనం లేదని అన్నారు. ఇది వైసిపి ప్రభుత్వ నిరంకుశ విధానమని విమర్వించారు. చట్టాన్ని రద్దు చేసే వరకూ ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ పోరాడుతుందని తెలిపారు. దీనిలో భాగంగానే ఐలు తరుపున పోస్ట్‌ కార్డు ఉద్యమం ద్వారా ప్రభుత్వాన్ని కదిలించాలన్నారు. దీనిలో న్యాయవాదులు, లబ్ధిదారులు, ప్రజల సహకారంతో కార్డులతో నిరసన ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఐలు జిల్లా కమిటీ సభ్యులు కౌరు వెంకటేశ్వర్లు, న్యాయవాదులు ఎం.సత్యనారాయణ ఆచార్యులు, అనుకూల రమేష్‌ చింతపల్లి నాగేశ్వరరావు, ఎం.సువర్ణరాజు, మృత్యుంజయరావు, ఆర్‌.శ్రీనివాస్‌, పి.సిద్దు, బి.భాస్కరరావు, జి.నారాయణ, ఎస్‌.చిట్టి మోషే పాల్గొన్నారు.

➡️