భూ యజమాని సంతకంపై చట్ట సవరణ చేయాలి

Jun 20,2024 22:41

సభలో మాట్లాడుతున్న తహశీల్ధార్‌
ప్రజాశక్తి – క్రోసూరు :
భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా అర్హులైన కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేసేలా చట్టాన్ని సవరించాలని కౌలురైతు సంఘం పల్నాడు జిల్లా నాయకులు టి.హనుమంతరావు కోరారు. యర్రబాలెం సచివాలయం (క్రోసూరు-3) వద్ద మండల వ్యవసాయాధికారి వేణుగోపాలరావు అధ్యక్షతన కౌలురైతుల గ్రామసభ గురువారం నిర్వహించారు. కౌల్దార్ల సమస్యలను హనుమంతరావు ప్రస్తావించారు. కౌలురైతులను గుర్తించాలంటే భూ యజమాని సంతకం చేయాలనే నిబంధనలతో గత ప్రభుత్వం 2019లో చట్టం తేవడం వల్ల గ్రామాల్లోని మొత్తం కౌల్దార్లలో 20-30 శాతానికి మించి గుర్తింపు కార్డులు పొందలేకపోయారని, దీంతో వాస్తవ సాగుదార్ల పేర్లు ఈ-క్రాప్‌ బుకింగ్‌లో నమోదు కాలేదని, రాయితీ విత్తనాలు, పంట నష్టపరిహారం అందలేదని, పంటల బీమాకూ అర్హులు కాలేకపోయారని వివరించారు. భూమిలేని ఓసీ సామాజిక తరగతి కౌలురైతులకూ గుర్తింపుకార్డులిచ్చి రైతు భరోసాను వారికీ అమలు చేయాలని అన్నారు. అనంతరం తహశీల్దార్‌, ఏవో మాట్లాడుతూ కౌల్దార్లకు కార్డుల విషయంలో భూ యజమాని నుండి ఏమైనా ఇబ్బందులుంటే కౌల్దార్లు అర్జీ ఇచ్చినానం తరం తాము మాట్లాడతామని చెప్పారు. గ్రామ సభలను ఉపయోగించుకుని ఎక్కువ మంది కౌలురైతులు గుర్తింపు కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దేవాదా యశాఖ భూములను సాగుచేసేవారికి ఈవో ద్వారా గుర్తింపు కార్డులు మంజూరు చేయిస్తామని చెప్పారు.

➡️