మూగబోయిన ప్రజా గొంతుక

ప్రజా ఉద్యమాల ఊపిరి.. ఉపాధ్యాయ ఉద్యమాల ముద్దుబిడ్డ, పిడిఎఫ్‌ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ (56) శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సమస్యలపై నిరంతరం పాటుపడే సాబ్జీ ఇక లేరనే విషయం తెలియగానే జిల్లావాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
రోడ్డు ప్రమాదంలో ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మృతి
ఉండి మండలం చెరకువాడలో ఘటన 
కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయ, ఉద్యోగ నేతలు
భీమవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం
నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు, జిల్లా అధికారులు
ఉద్యమాలకు తీరని లోటున శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు
ప్రజా ఉద్యమాల గొంతుక మూగబోయింది : ఎంఎల్‌సి ఐవి
ప్రజాశక్తి – భీమవరం
సాబ్జీ శుక్రవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఏలూరు నుంచి వి.శ్రీనివాసరావుకు చెందిన కారులో పిఎ ఆలీ, గన్‌మెన్‌ ఎస్‌.ముత్యాలరావుతో కలిసి భీమవరం బయల్దేరారు. మార్గమధ్యంలో ఏలూరు జిల్లా కైకలూరు, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో అంగన్వాడీల సమ్మె శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. అక్కడ నుంచి భీమవరంలో కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న ఆశాలకు సంఘీభావం తెలిపేందుకు భీమవరం బయల్దేరారు. ఉండి మండలం చెరుకువాడ వచ్చేసరికి ఎదురుగా భీమవరం నుంచి ఆకివీడు వైపు వెళ్తున్న కారు ఎంఎల్‌సి సాబ్జీ కారను బలంగా ఢకొీంది. ఈ ప్రమాదంలో సాబ్జీ నుదుటి భాగంలో బలమైన గాయం కావడంతోపాటు ఛాతిపైనా బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పిఎ ఆలీకి తీవ్ర గాయాలవ్వగా, కారు నడుపుతున్న శ్రీనివాసరావుకు, గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. వీరిని భీమవరంలోని ప్రయివేట్‌ ఆసుపత్రికి తరలించారు. సాబ్జీ భౌతికకాయాన్ని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి సాయంత్రం వరకూ సందర్శన నిమిత్తం అక్కడే ఉంచారు. ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవి), యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి యుటిఎఫ్‌ పతాకాన్ని ఎంఎల్‌సి సాబ్జీ భౌతికకాయంపై ఉంచి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌ అక్కడకు చేరుకుని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు పెద్దసంఖ్యలో ప్రభుత్వాసుపత్రికి తరలొచ్చారు. శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌, జాయింట్‌ కలెక్టర్‌ రామ్‌సుందర్‌రెడ్డి, భీమవరం ఆర్‌డిఒ శ్రీనివాసులురాజు, డిఇఒ ఆర్‌.వెంకటరమణ, డిఎంహెచ్‌ఒ మహేశ్వరరావు సాబ్జీ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లా కార్యదర్శులు బి.బలరాం, ఎ.రవి, యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి, సిఐటియు పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జెఎన్‌వి.గోపాలన్‌, కె.రాజారామ్మోహన్‌రారు, ఆర్‌.లింగరాజు, డిఎన్‌విడి.ప్రసాద్‌, యుటిఎఫ్‌ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఎస్‌.విజయరామరాజు, ఎకెవి.రామభద్రం, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు తదితరులు నివాళులర్పించారు.కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భౌతికకాయం వద్ద సాబ్జీ భార్య షేక్‌ షబానీ బేగం, కుమారుడు ఆజాద్‌, సోదరి జెరినా, బావ సుభాని కన్నీరుమున్నీరుగా విలపించారు.తలకు బలమైన గాయం: జిల్లా ఎస్‌పి రవి ప్రకాష్‌ ఎంఎల్‌సి సాబ్జీ మృతి బాధాకరమని జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌ అన్నారు. సాబ్జీ భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎంఎల్‌సి కారు ప్రమాదానికి గురైందన్నారు. ఎదురుగా వస్తున్న మరొక కారు సాబ్జీ కారును బలంగా ఢకొీందని తెలిపారు. ప్రమాదంలో సాబ్జీ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు.ఉద్యమాలకు తీరని లోటుశాసనమండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజు పేద ప్రజల, పలు సంఘాల గొంతుక ఎంఎల్‌సి సాబ్జీ అని, ఆయన మృతి అత్యంత బాధాకరమని శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. భీమవరం ప్రభుత్వాసుపత్రిలో భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మోషేన్‌రాజు మాట్లాడుతూ ప్రజా సమస్యలను శాసనమండలిలో లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో సాబ్జీకి ఎవరూ సాటిరారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సాబ్జీ మృతి తీవ్ర బాధాకరమన్నారు. ఆయన లేని లోటు ఉద్యమాలకు తీరని లోటని తెలిపారు. వ్యక్తిగతంగా తనకు మంచి మిత్రులని, కొన్ని విషయాలు తాను కూడా అడిగి తెలుసుకునే వాడినని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, శాసనమండలి తరపున, వ్యక్తిగతంగానూ సాబ్జీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.సాబ్జీ మరణం దురదృష్టకరంయుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి గోపీమూర్తి ఎంఎల్‌సి సాబ్జీ మృతి బాధాకరమని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక గొంతుకగా ఉన్న సాబ్జీ మృతి జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. రైతులు, కార్మికుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న సాబ్జీ తమకు పెద్దదిక్కని, ఆయన మృతి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు.ఉద్యమాల గొంతుక మూగబోయిందిఎంఎల్‌సి ఐవి ఉద్యమాలే ఊపిరిగా పని చేస్తున్న ఎంఎల్‌సి సాబ్జీ మృతి అత్యంత బాధాకరమని ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవి) అన్నారు. సాబ్జీ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై నిర్విరామంగా పని చేశారన్నారు. సాబ్జీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాబ్జీ మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతిడిప్యూటీ సిఎం కొట్టు సంతాపం తాడేపల్లిగూడెం: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మృతి పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాబ్జీ టీచరుగా జీవితాన్ని ప్రారంభించి ఉపాధ్యా య ఉద్యమ నిర్మాణంలో అత్యంత క్రియాశీలక పాత్ర వహించారని మంత్రి కొనియాడారు. ఎంఎల్‌సిగా గెలిచి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. సాబ్జీ మరణంతో జిల్లా ఒక మంచి పోరాట యోధుడిని, ఉద్యమ నాయకుడిని కోల్పోయిం దని విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు కొట్టు సత్యనారాయణ ప్రగాఢ సానుభూతి తెలిపారు.నిమ్మల, అంగర సంతాపం పాలకొల్లు: రోడ్డు ప్రమాదంలో ఎంఎల్‌సి సాబ్జీ మృతి తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు, మాజీ ఎంఎల్‌సి అంగర రామ్మోహన్‌రావు అన్నారు. సాబ్జీ మృతి వ్యక్తిగతంగా తనకు, ఉపాధ్యాయ లోకానికి తీరని లోటని సంతాపం తెలిపారు. సాబ్జీ సుదీర్ఘ పరిచయం ఉందని, నిత్యం పోరాడయోధుడిగా ఉండేవారని అంగర కొనియాడారు. సిపిఎం సంతాపం ఏలూరు అర్బన్‌: పిడిఎఫ్‌ ఎంఎల్‌సి సాబ్జీ మృతి పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి బి.బలరాం, ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. సాబ్జీ మృతి కుటుంబానికే కాకుండా ఉపాధ్యాయ ఉద్యమానికి, ప్రజాఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. సాబ్జీ కృషిని, సహకారాన్ని మరవలేవని తెలిపారు. చివరి క్షణం వరకూ ప్రజా ఉద్యమాల్లో మమేకమయ్యారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.సిపిఐ, ఎఐటియుసి సంతాపం ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మృతి పట్ల సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఎఐటియుసి ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్‌డాంగే, ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, కోశాధికారి పుప్పాల కన్నబాబు, ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు తీవ్ర సంతాపం తెలిపారు.

➡️