రైతులపై మోడీ ప్రభుత్వ దమనకాండ దారుణం

ఢిల్లీలో యువరైతు మృతిపై వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా
ప్రజాశక్తి – ఏలూరు సిటీ
కనీస మద్దతు ధర కోసం ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులపై బిజెపి, మోడీ ప్రభుత్వం పోలీసు కాల్పులకు తెగబడి యువరైతు ప్రాణం బలిగొనడాన్ని నిరసిస్తూ ఏలూరులో వామపక్షాలు గురువారం ధర్నా నిర్వహించాయి. ఏలూరు పాత బస్టాండ్‌ సెంటర్‌ వద్ద సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీలు ఆందోళన చేపట్టాయి. సిపిఐ, సిపిఎం నగర కార్యదర్శులు యు.హేమశంకర్‌, పి.కిషోర్‌ అధ్యక్షతన చేపట్టిన నిరసనలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య, న్యూడెమోక్రసీ ఏలూరు కార్యదర్శి బద్ద వెంకట్రావు, రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌ మాట్లాడుతూ పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని ఆందోళన చేస్తున్న అన్నదాతలపై మోడీ ప్రభుత్వం నిరంకుశత్వంగా పోలీసులచే కాల్పులు జరిపించడాన్ని ఖండించారు. కాల్పుల్లో శుబ్‌కరణ్‌సింగ్‌ అనే రైతు మరణించారని, 30 మందికిపైగా రైతులు గాయపడ్డారని తెలిపారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నలపై మోడీ ప్రభుత్వ దమనకాండ దారుణమన్నారు. ఇప్పటికైనా రైతులతో చర్చించి వారి సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాబోయే ఎన్నికల్లో రైతులు బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌, జిల్లా నాయకులు బి.సోమయ్య, వివిధ సంఘాల జిల్లా నేతలు పిచ్చుక ఆదిశేషు, పివి.రామకృష్ణ, కొర్రి విజయలక్ష్మి, కె.రామాంజనేయులు, మావూరి శ్రీనివాసరావు, ఎం.ఇస్సాక్‌, ఎస్‌.సత్యనారాయణ, మీసాల సత్యం, జి.కోటేశ్వరరావు, కాకి నాని, ఎం.క్రాంతి, యర్రా శ్రీనివాసరావు, ముంగం అప్పారావు, మంగరాజు రాము, అప్పలరాజు, సిపిఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, నేతలు కురెళ్ల వరప్రసాద్‌, పుప్పాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️