రైల్వే గూడ్స్‌ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు
ఘనంగా రైల్వే గూడ్స్‌ షెడ్‌ వర్కర్స్‌ యూనియన్‌ 40వ వార్షికోత్సవం
ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం
రైల్వే గూడ్స్‌ షెడ్లో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, పెంటపాడు మండల కన్వీనర్‌ చిర్ల పుల్లారెడ్డి తెలిపారు. తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్‌ షెడ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం)40వ వార్షికోత్సవం స్థానిక రైల్వే గూడ్స్‌ షెడ్‌ కార్యాలయంలో సత్తి కోదండరామిరెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. తొలుత సత్తి కోదండ రామిరెడ్డి సిఐటియు జెండా ఆవిష్కరించారు. 2023వ సంవత్సరం కార్యకలాపాల రిపోర్టును చిర్ల పుల్లారెడ్డి ప్రవేశపెట్టారు. యూనియన్‌ సభ్యులు రిపోర్టును ఆమోదించారు. ఈ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ రైల్వే గూడ్స్‌ షెడ్‌లో పని చేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, పని భద్రత కల్పించాలని, 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. రైల్వే గూడ్స్‌ షెడ్ల వద్ద పనిచేస్తున్న కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. దేశంలో అసంఘిటిత రంగంలో పనిచేసే 40 కోట్ల మంది కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్‌, గ్రాడ్యూటీ, ఇన్సూరెన్స్‌ అమలు చేయాలన్నారు. బిజెపి 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించడం దుర్మార్గమన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి మద్దతు తెలిపే పార్టీలను ఓడించాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షలుగా సత్తి కోదండ రామిరెడ్డి, ఉపాధ్యక్షులుగా కర్రి సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా చిర్ల పుల్లారెడ్డి, సహాయ కార్యదర్శిగా కర్రి నాగేశ్వరరావు, కోశాధికారిగా ఎస్‌విఎస్‌.రెడ్డి, కమిటీ సభ్యులుగా ఆకుల నారాయణ, కర్రి సుబ్బిరెడ్డి, అడపా ఆంజనేయులు, మద్దాల పుత్రయ్య, బుద్దాల నాని, అడ్డగర్ల కృష్ణ, కర్రి శ్రీనివాసరెడ్డి, గాది వెంకటరావు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గొన్నాబత్తుల నాగేశ్వరరావు, కరెడ్ల రామకృష్ణ, జవ్వాది శ్రీను, నరమాల కృష్ణ, మెట్రెడ్డి రమణ, కుంచంగి నానాజీ, గొర్రెల సతీష్‌కుమార్‌, పులిమంతుల రమణ, చల్లా చంద్రరావు పాల్గొన్నారు.

➡️