వర్షపు నీరు.. విద్యార్థుల అవస్థలు

ప్రజాశక్తి – ఉండి
మిచౌంగ్‌ తుపాను వల్ల ఉండి జెడ్‌పి హైస్కూల్‌ ఆవరణం చెరువులా మారడంతో ఇక్కట్లు తప్పట్లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వర్షపు నీటిలో స్థానికులు వలలతోటి చేపలు పట్టుకుంటున్నారు. స్కూల్‌ చుట్టూ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉండటంతో వాటిలోని చేపలు క్రీడా ప్రాంగణంలోకి చేరడంతో వలలు వేసి చేపలు పట్టుకున్నారు. వర్షాలు తగ్గి మూడు రోజులవుతున్నా పాఠశాల ఆవరణలో నిల్వ ఉన్న నీటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. నిల్వ నీరు వల్ల పిల్లలకు ఎటువంటి వ్యాధులు వస్తాయోనని తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. సిఎం జగన్‌ ఆడుదాం ఆంధ్రా అని ఆర్భాటం చేస్తున్నారు తప్ప సరైన గ్రౌండ్‌ లేదన్నారు. స్కూల్లో కూడా ఒక పిఇటి మాత్రమే ఉన్నారన్నానరు. సెప్టెంబర్‌ 19వ తేదీన జెడ్‌పి ఛైర్‌పర్సన్‌ ఉండి హైస్కూల్‌కి వచ్చి స్పెషల్‌ గ్రాంట్‌తో గ్రౌండ్‌ మొత్తం పూడుస్తానని చెప్పి వెళ్లారు తప్ప ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. పాఠశాల ఆవరణలో నీటిని ఇంజిన్ల సహాయంతో బయటకు తోడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

➡️