సంఘ సేవకులు రంగసాయికి పూర్ణ కుంభ పురస్కారం

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌
ఈ నెల ఐదో తేదీన రాజమండ్రిలో ఆంధ్ర సర్వసత పరిషత్‌, చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో జరిగిన రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో భీమవరానికి చెందిన సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి పూర్ణ కుంభ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రంలోనే స్వాతంత్య్ర ఉద్యమం, సినిమా, నాటక, సంగీత, సాహిత్య, సామాజిక సేవా రంగాల్లో విశేష సేవలందించిన 72 మందికి ఈ పూర్ణ కుంభ పురస్కారాలు అందించారని రంగసాయి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు పద్మభూషణ్‌ యార్లగర్ల లక్ష్మీప్రసాద్‌, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌, తెలుగు మహాసభల నిర్వాహకులు గజల్‌ శ్రీనివాస్‌, చైతన్యరాజు చేతుల మీదుగా పూర్ణ కుంభ పురస్కారాన్ని అందుకున్నామని తెలిపారు. డొక్కా సీతమ్మ, కందుకూరి, గుర్రం జాషువా, ఘంటసాల, జమున రాణి వారి కుటుంబ సభ్యులతోపాటు మరి కొంతమందికి ఈ అవార్డులను అందించారని తెలిపారు. క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి శ్రీనివాస్‌రాజును సత్కరించారని తెలిపారు. టిటిడి పాలకవర్గ సభ్యులు గాదిరాజు సుబ్బరాజు, ప్రముఖ సినీనటులు తనికెళ్ల భరణి పాల్గొన్నారని తెలిపారు.

➡️