సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె విరమణ

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె గురువారం విరమించారు. డిసెంబర్‌ 19 తేదీన సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచి 20వ తేదీ నుంచి సమ్మె చేపట్టి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీరి సమ్మెకు సిఐటియు బాసటగా నిలిచి పూర్తి మద్దతు తెలిపింది. దీనికి తోడు ఉపాధ్యాయ సంఘాలు యుటిఎఫ్‌, రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. 21 రోజుల తర్వాత దిగొచ్చిన ప్రభుత్వం డిమాండ్లను పరిశీలించేందుకు హామీ ఇవ్వడంతో ఉద్యోగులు సమ్మె విరమించి గురువారం డిఇఒ వెంకటరమణకు విరమణ నోటీసు ఇచ్చి విధుల్లోకి హాజరయ్యారు. సమ్మె శిబిరం వద్దకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌ రారు వెళ్లి ఉద్యోగులను అభినందించారు. పోరాటాలతోనే హక్కులను సాధించుకోగలమని అన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపిమూర్తి మాట్లాడుతూ సమ్మెతో ఉద్యోగులకు ఒక గుర్తింపు వచ్చిందన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం మరింత బలపడటానికి బలమైన పునాది వేసుకోవాలన్నారు. సమగ్ర శిక్ష జెఎసి జిల్లా అధ్యక్షులు షేక్‌ బావాజీ మాట్లాడారు. సమ్మెకు మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలకు, తోటి ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు బి.రామరాజు, సమగ్ర శిక్ష జెఎసి నాయకులు వాసు, సంతోషి, నాగలక్ష్మి, శ్రీనివాస్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️