సమస్యలపై సానుకూలంగా స్పందించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం

ప్రజాశక్తి – భీమవరం

నెల రోజుల నుంచి శాంతియుతంగా పోరాడుతున్న అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం దుర్మార్గమని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. జిల్లాలో జరుగుతున్న సమ్మె, ఆందోళనలకు మద్దతుగా బుధవారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు కన్నతల్లుల్లా పిల్లలకు, మహిళలకు, గర్భిణులకు సేవలందిస్తున్నారన్నారు. వారి సేవలను అనేక రకాలుగా ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని తెలిపారు. జగన్‌ ఇచ్చిన హామీని అమలుచేయాలని మాత్రమే అడుగుతున్నారని తెలిపారు. వేతనం, గ్రాడ్యూటీ పెంచాలని డిమాండ్‌ చేశారు. న్యాయమైన పోరాటం చేస్తున్న వారిపై ఎస్మా ప్రయోగం దారుణమన్నారు. తక్షణం ఎస్మా ప్రయోగాన్ని విరమించుకోవాలని, జిఒ 2ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు మున్సిపల్‌ కార్మికులు కూడా 15 రోజులుగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో చెత్త పేరుకుపోయిందని ప్రభుత్వం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. తక్షణం అంగన్వాడీ, మున్సిపల్‌ కార్మికులు, ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే అన్ని రాజకీయ పార్టీలనూ కలుపుకుని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జెక్కంశెట్టి సత్యనారాయణ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రాజు, కార్యకర్తలు రత్నకుమారి, లత, నాగరాజు పాల్గొన్నారు

➡️