సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి : కలెక్టర్‌

కలెక్టరేట్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

ప్రజాశక్తి – భీమవరం

భీమవరం కలెక్టరేట్లో సంక్రాంతి సంబరాలు గురువారం అంబరాన్నంటాయి. జిల్లా ఖజానా, ట్రెజరీ శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా సాగాయి. సంక్రాంతి సంబరాలను జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ప్రారంభించారు. జిల్లా ఖజానా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బొమ్మల కొలువు ఎంతో మందిని ఆకట్టుకుంది. జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి ఖజానా కార్యాలయ సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సాంప్రదాయం ఉట్టిపడేలా వేడుకగా జిల్లా ట్రెజరీ అధికారి ఆడారి గణేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించడాన్ని ప్రశంసించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతి అన్నారు. కుటుంబ సభ్యులందరూ పండగ రోజుల్లో ఒక చోట చేరి ఆనందోత్సాహాలతో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అన్నారు. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో తెలుగు సంక్రాతి పండుగను పురస్కరించుకొని గురువారం నుంచి శనివారం వరకూ మూడు రోజులు పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. బొమ్మల కొలువు, భోగి మంట, చెరుకు గెడలు, పూర్ణకలశాలు, ధాన్యపు కంకులు, రేగిపళ్లు మొదలైన వాటితో సంక్రాంతి శోభను తీర్చిదిద్దారు. జిల్లా ట్రెజరీ సభ్యులందరికి ‘ఖేలో ఖజానా’ పేరుతో ఆటల పోటీలు నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం సంక్రాంతి వంటలైన క్షీరాన్నం, కొబ్బరి అన్నం, చింతపండు పులిహార, పెరుగు ఆవడ, అరిసెలు, బూరెలు, గారెలు, బొబ్బట్లు, కాజాలు, సున్నుండలు, లడ్డూలు పూతరేకులు, కజ్జికాయలు, జంతికలు, అప్పడాలు, ఉలవచారు, పచ్చిపులుసు, రోటి పచ్చడి మొదలైన పిండివంటలను సిబ్బంది స్వయంగా తయారుచేసి ఆహుతులకు విందు ఏర్పాటు చేశారు. జిల్లా ట్రెజరీ అధికారి ఆడారి గణేష్‌, సహాయ ట్రెజరీ అధికారి అబ్దుల్‌ హకీం, ఎస్‌టిఒలు జె.రామారావు, ఇ.హిమబిందు, ఎ.రవివర్మ, పి.హరిబాబు పాల్గొన్నారు.

➡️