సీట్లు ఇవ్వం..ఓట్లు వేయండి..!

మహిళ పట్ల టిడిపి, వైసిపి, జనసేన వివక్ష

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

మహిళా సాధికారితపై తెగ ఉపన్యాసాలు దంచేసే టిడిపి, వైసిపి ఎన్నికల సీట్ల కేటాయింపులో మాత్రం మహిళల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శించాయి. టిడిపి, జనసేన అత్యంత దారుణంగా వ్యవహరించగా, వైసిపి మాత్రం మహిళలకు ఒక్క సీటు ఇచ్చి మమ అనిపించింది. రెండు జిల్లాలో అత్యధికంగా మహిళా ఓటర్లే ఉన్నారు. అయినప్పటికీ మహిళలకు సీట్లు లేకుండా పోయిన పరిస్థితి నెలకొంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై ఊదరగొట్టే పార్టీలు అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల కేటాయింపులపై సమాధానం చెప్పాలన్న విమర్శలు వినిపిస్తున్నాయి.మాటకు ముందు.. మాటకు వెనుక మా అక్కచెల్లెమ్మలంటూ మాట్లాడే టిడిపి, వైసిపి అధ్యక్షులు రెండు జిల్లాలోని అసెంబ్లీ సీట్ల కేటాయింపులో అత్యంత దారుణంగా వ్యవహరించిన పరిస్థితి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 14 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా టిడిపి అభ్యర్థులు తణుకు, ఆచంట, పాలకొల్లు, ఉండి, నూజివీడు, చింతలపూడి, దెందులూరు, ఏలూరు మొత్తం ఎనిమిది స్థానాల్లో, ఉంగుటూరు, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, పోలవరం మొత్తం ఐదు స్థానాల్లో జనసేన అభ్యర్థులు, కైకలూరులో ఒక్కచోట బిజెపి అభ్యర్థి పోటీ చేస్తున్నారు. మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో పొత్తుతో కలిసి పోటీచేస్తున్న టిడిపి, జనసేన, బిజెపి ఏ ఒక్క పార్టీ నుంచి మహిళలకు ఒక్క అసెంబ్లీ సీటు కూడా కేటాయించని పరిస్థితి నెలకొంది. రెండు లోక్‌సభ స్థానాల్లో నరసాపురం నుంచి బిజెపి అభ్యర్థి, ఏలూరు నుంచి టిడిపి అభ్యర్థి పోటీ చేస్తున్నారు. లోకసభ స్థానాల్లోనూ మహిళలకు ఎటువంటి సీటూ కేటాయించలేదు. గతంలో ఎన్నడూలేని విధంగా టిడిపి మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన పరిస్థితి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైసిపి మాత్రం ఒక్కో సీటుతో మమ అనిపించిన పరిస్థితి. 14 అసెంబ్లీ స్థానాల్లో వైసిపి పోలవరం టిక్కెట్‌ తెల్లం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మికి కేటాయించగా, నరసాపురం లోకసభ స్థానంలో గూడూరి ఉమాబాలకు కేటాయించింది. లోకసభ స్థానాల్లో రెండింటిలో ఒకటి మహిళకు వైసిపి కేటాయించడం కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ అసెంబ్లీ సీట్ల విషయంలో మాత్రం వివక్ష నెలకొంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల ప్రాతిపదికన చూసిన రెండు జిల్లాలో నాలుగు నుంచి ఐదు స్థానాలు కేటాయించాల్సి ఉంది. ఎక్కడా అది అమలు కాలేదు. ఏలూరు జిల్లాలో మొత్తం 16,25,655 మంది ఓటర్లు ఉండగా అందులో 8,31,701 మంది అత్యధికంగా మహిళా ఓటర్లే ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 14,58,832 మంది ఓటర్లకుగాను, 7,44,303 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రెండు జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్న పరిస్థితి. సీట్ల కేటాయింపులో మాత్రం మహిళలు పూర్తిగా విస్మరించిన పరిస్థితి నెలకొంది. మహిళలకు ఉచిత ప్రయాణం, డ్వాక్రా రుణమాఫీ అంటూ హామీలు గుప్పించి ఓట్లు దండుకునేందుకు చూస్తున్న ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపిలు చట్టసభల్లో మాత్రం మహిళలకు అవకాశం ఇచ్చేందుకు ముందుకు రాని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా ఎంఎల్‌ఎలు లేకపోతే భవిష్యత్తులో జిల్లా పరిషత్‌, జిల్లా సమీక్షా సమావేశాల్లో మహిళల తరపున గొంతు వినిపించే అవకాశం లేకుండా పోనుంది. మహిళలను ఓటు బ్యాంకుగా మాత్రమే ప్రధాన పార్టీలు భావిస్తూ ఒకటి, రెండు ఉచిత పథకాలు ప్రకటించి ఓట్లు దండుకోవాలని చూస్తున్నాయి. ఎంఎల్‌ఎ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన చోట సైతం భర్తలే పెత్తనం చేస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. టిడిపి, వైసిపిలు మహిళల గురించి చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకూ ఏ మాత్రమూ సంబంధం లేకుండా పోయింది. మహిళలు ఒక్కసారి తమశక్తిని చూపిస్తే ఇలాంటి పార్టీలకు జ్ఞానోదయం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

➡️