సెన్స్‌తోనే సమాజాభివృద్ధి : డిఇఒ

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

సైన్స్‌ను ప్రోత్సహించాలని, సైన్స్‌తోనే సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌.వెంకటరమణ ఉపాధ్యాయులను కోరారు. విష్ణు స్కూల్లో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాల బహుమతి ప్రదానోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను విజయనగరం ప్రాంతంలో పనిచేశానని, అక్కడ చేతబడి, చిల్లంగి వంటి మూఢనమ్మకాలు ఉండేవని, వాటిపై జన విజ్ఞాన వేదిక ప్రచారం చేయడం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసిందని తెలిపారు. వీధి నాటకాలను సైతం జన విజ్ఞాన వేదిక ప్రదర్శించేదన్నారు. జిల్లాలో జన విజ్ఞాన వేదిక సైన్స్‌ పోటీలను నిర్వహించడం, సైన్స్‌పై ప్రచారం చేయడం అభినందనీయమన్నారు. విద్యాదాత, బాంబే స్వీట్స్‌ అధినేత బాపిరాజును ఆయన అభినందించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన పలువురికి జ్ఞాపికలు అందజేశారు. ఉప విద్యాశాఖ అధికారి శ్రీరామ్‌ మాట్లాడుతూ పోటీలో పాల్గొన్నవారు తమకు బహుమతులు, ర్యాంకులు రాలేదని నిరుత్సాహానికి గురికావొద్దన్నారు. పోటీల్లో పాల్గొనడం వల్ల పోటీతత్వం, విజ్ఞానం పెరుగుతాయన్నారు. ఎంఇఒ వేండ్ర వెంకటేశ్వరరావు, యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి, మాట్లాడుతూ సైన్స్‌పై అవగాహన కల్పించడం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతున్నారు. సీనియర్‌ నాయకులు పోలిశెట్టి గోపాలకృష్ణ గోఖలే మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి జెవివి దశాబ్ధాలుగా కృషి చేస్తోందన్నారు. నోబెల్‌ పురస్కార గ్రహీత సివి.రామన్‌ను స్ఫూర్తిగా తీసుకుని జెవివి ఆవిర్భవించిందన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లా ప్రగడ సుబ్బారావు జన్మించిన భీమవరంలో చెకుముకి జిల్లాసాయి సైన్స్‌ సంబరాలు చేసుకోవడం అభినందనీయమన్నారు. ఎల్లా ప్రగడ సుబ్బారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యదర్శి జామాను లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రజల కోసం, ప్రగతి కోసం, స్వావలంబన కోసం జెవివి పనిచేస్తోందన్నారు. కన్వీనర్‌ రేపాక వెంకన్న బాబు అతిథులను ఆహ్వానించి మాట్లాడారు. కోశాఖాధికారి మల్లుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ 250 స్కూల్స్‌కు సంబంధించి 14,000 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారన్నారు. పొత్తూరి బాపిరాజు మాట్లాడుతూ విద్యాదానం మహాదానం అన్నారు. దంగేటి గోపాలకృష్ణ గోర్కి, సుకుమార్‌ మాట్లాడారు. బహుమతులు ప్రధానం సందర్భంగా శాస్త్రవేత్తలు ఎలా ప్రగడ సుబ్బారావు ,ఎమ్మెస్‌ స్వామినాథన్‌, జెవివి నాయకురాలు సత్యవతి, సత్యనారాయణమ్మ, సిహెచ్‌ శ్రీనివాసరావు తదితరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా గౌరవాధ్యక్షులు కెపిఎస్‌ఎన్‌.వర్మ పతాకావిష్కరణ చేశారు. జిల్లా కార్యదర్శి అలుగు జాన్సన్‌ వందన సమర్పణ చేశారు. అధ్యక్షులు చింతపల్లి ప్రసాద్‌, విష్ణు పబ్లిక్‌ స్కూల్‌ ప్రధానోపా ధ్యాయులు ఆర్‌.సత్యమూర్తి, టి.వెంకటేశ్వరరావు, సిహెచ్‌ ఉదరు కిరణ్‌, పి.హరికృష్ణ పాల్గొన్నారు.విజేతలు వీరే..జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 34 టీముల్లో ప్రథమ స్థానంలో రెండు టీములు నిలిచాయి. యలమంచిలి మండలం మట్లపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులు జి.మాధురి దీక్ష, ఎఆర్‌.లక్ష్మి, జి.మీనాక్షి, పాలకొల్లు భారతీయ విద్యా భవన్‌కు చెందిన విద్యార్థులు జి.తేజస్వి, ఎం.తన్మయ్య, రిషిత్‌ విజేతలుగా నిలిచారు. విజయం సాధించిన ఆయా విద్యార్థులు రాష్ట్రస్థాయి సైన్స్‌ సంబరాలకు ఎంపికయ్యారు. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో పల్నాడులోని చిలకలూరిపేటలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొనున్నారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజయం సాధించిన వారికి కూడా సర్టిఫికెట్లు అందజేశారు.

➡️