సేవల్లో ఎస్‌ఆర్‌కెఆర్‌కు ప్రథమ స్థానం

ప్రజాశక్తి – కాళ్ల

ఇంజినీరింగ్‌ కళాశాలలు దత్తత గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఏయూలో మొదటి స్థానంలో నిలిచిందని ఏయూ కోఆర్డినేటర్‌ బి.పావని తెలిపారు. పెదఅమిరంలో ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఉన్నత భారత్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో వ్యక్తిగత భద్రతపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. యుబిఎ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కెఎం.గణేష్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ ప్రతి కళాశాలా దత్తత గ్రామాల్లో సేవలందిస్తే నరేంద్ర మోడీ ఆశయాలు ప్రతి పల్లెకూ తీసుకెళ్లిన ఘనత ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామీణ ప్రగతికి నిరంతరం కృషి చేయాలన్నారు. అప్పుడే పల్లెలు అభివృద్ధి చెందుతాయన్నారు. కళాశాల డైరెక్టర్‌ ఎం.జగపతి రాజు మాట్లాడుతూ గతేడాది దత్తత గ్రామాలైన కోపల్లె, పెదమిరం, జక్కరం, కాళ్ల, కాళ్లకూరు గ్రామాల్లో తమ యుబిఎ విభాగం కళాశాల యాజమాన్యం సహకారంతో చాలా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అందువల్లే ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 1150 విభాగాలు ఉండగా తమ కళాశాల మొదటి స్థానంలో నిలిచిందని, అందుకు యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహమే కారణమని తెలిపారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. పెదఅమిరం సర్పంచి డొక్కు సోమేశ్వరరావు మాట్లాడుతూ తమ గ్రామాన్ని యుబిఎ దత్తత తీసుకొని సాంకేతిక సహకారం, సూచనలు అందించడం తమ గ్రామ ప్రగతికి ఎంతగానో దోహద పడుతోందన్నారు. పెదఅమిరం మండల పరిషత్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయిని ప్రసన్న భారతికి, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. కార్యక్రమంలో ఉన్నత భారత అభియాన్‌ కోఆర్డినేటర్‌, ఆర్‌అండ్‌ డిన్‌ పిఎ.రామకృష్ణమరాజు, ఉన్నత భారత అభియాన్‌ ఉత్తమ కోఆర్డినేటర్‌ అవార్డు గ్రహీత టి.రాంబాబు, పి.భువనేశ్వరి, పి.రఘురాం, సూరిబాబు పాల్గొన్నారు.

➡️