స్పందించకుంటే ఉద్యమం మరింత ఉధృతం

మున్సిపల్‌ కార్యాలయాలను ముట్టడించిన మున్సిపల్‌ కార్మికులు
12వ రోజుకు సమ్మె
ప్రజాశక్తి – తణుకు రూరల్‌
మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన అమలు చేసేంతవరకూ ఉద్యమం ఆగదని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌, ఎఐటియుసి జిల్లా నాయకులు బొద్దాని నాగరాజు హెచ్చరించారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మె శనివారంతో 12వ రోజుకు చేరుకుంది. స్థానిక సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు వచ్చి నాయకులు పివి.ప్రతాప్‌, కామన మునిస్వామి, బొద్దాని నాగరాజు, అడ్డగర్ల అజయకుమారి, గార రంగారావులను బలవంతంగా లాక్కుని పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లారు. పోలీస్‌ జులుం నశించాలని, అక్రమ అరెస్టులు ఖండించాలని, ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కామన మునిస్వామి ఆధ్వర్యంలో కార్మికులు పోలీస్‌స్టేషన్‌ వద్ద బైఠాయించి అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ధర్నా చేశారు. నాగరాజు, ప్రతాప్‌ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించేవరకూ పోరాటం ఆగదన్నారు. పోటీ కార్మికు లను అడ్డుకుని పంపించి వేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌.ఆది నారా యణబాబు, కృష్ణబాబు, కేశవ, మందులయ్య, అయ్యప్ప, నాగేంద్ర కుమార్‌, ఎం.ముత్తయ్య, కె.రవికు మార్‌, గండ్ర శ్రీను, జి.వెంక టేశ్వరరావు, జి.అన్న పూర్ణ, ఎం.లక్ష్మి, సుధాకర్‌, జ్యోతి బాబు, అనంతలక్ష్మి, రాజేశ్వరి, రాజమ్మ పాల్గొన్నారు.తాడేపల్లిగూడెం : మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించేవరకూ సమ్మె విరమించేది లేదని మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు హెచ్చరించారు. మున్సిపల్‌ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించి అధికారులను, ఉద్యోగులను విధులకు వెళ్లనియకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ వర్కర్స్‌ యూని యన్‌ జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 12 రోజులుగా కార్మికుల సమ్మె చేస్తున్నా సమస్యలు పరిష్కరించకపోగా సమ్మె విచ్ఛిన్నానికి ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే రానున్న కాలంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.సతీష్‌, దనాల రాజు, భాను, దయామని, దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.నరసాపురం టౌన్‌ : స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగాలు రెగ్యులర్‌ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ తక్షణం మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి పొన్నాడ రాము, మున్సిపల్‌ కార్మిక, ఉద్యోగులు ఎంవి.సత్యనారాయణ, సిహెచ్‌.వాసు, టి.పార్థసారధి, మధు, అనంతలక్ష్మి, టి.కల్యాణి, ఎస్‌కె.అమీన, కె.సుజాత, డి.వరలక్ష్మి, భవాని పాల్గొన్నారు.

➡️