40 శాతం సమ్మర్‌ అలవెన్స్‌ ఇవ్వాలి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ
ప్రజాశక్తి – పాలకోడేరు
ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు సమ్మర్‌ అలవెన్స్‌ 40 శాతం ఇవ్వాలని, అడిగిన వారందరికీ పని కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని శృంగవృక్షం గ్రామంలో పంట కాలువలో పని చేస్తున్న కూలీల సమస్యలను సత్యనారాయణ బుధవారం అడిగి తెలుసుకుని మాట్లాడారు. కొందరు ఆకతాయిలు మద్యం తాగేసి ఆ సీసాలను పంట కాలువల్లో పడేయడంతో అందులో దిగి పని చేస్తున్న కూలీలకు గాయాలవుతున్నాయన్నారు. కనీసం ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు అందుబాటులో ఉండడంలేదన్నారు. గతంలో వేసవిలో తాగునీటికి, మజ్జిగకు ప్రభుత్వం నిధులు కేటాయించేదని, ప్రస్తుతం కూలీలే తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. వేతనాలు బ్యాంకుల ద్వారా కాకుండా పోస్టాఫీస్‌ల ద్వారా ఇచ్చే పద్ధతి కొనసాగించాలన్నారు. ఆన్‌లైన్‌ మస్తర్‌ కాకుండా పాత పద్ధతిలో మస్తర్‌ విధానాన్ని కొనసాగించాలని, కనీస వేతనం రూ.600 ఇవ్వాలని, రూ.200 రోజులు పని దినాలు పెంచాలని డిమాండ్‌ చేశారు.

➡️