నిట్‌లో 480 సీట్ల కేటాయింపు పూర్తి

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం

జోసా (జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ) 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌ మొదటి రౌండ్‌లోనే ఎపి నిట్‌లోని మొత్తం 480 సీట్లకు (అలాట్‌మెంట్‌లు) కేటాయింపు పూర్తయిందని ఎపి నిట్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పి.దినేష్‌శంకర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థలో మొత్తం ఎనిమిది కోర్సులకుగాను ఒక్కో కోర్సులో సిఇసి 90 సీట్లు, ఇఇఇ 90, ఇసిఇ 90, సివిల్‌ 60, మెకానికల్‌ 60, కెమికల్‌ 30, బయో టెక్నాలజీ 30, ఎంఎంఇ 30 చొప్పున మొత్తం 480 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. వీటిలో 50 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులతోను, మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాల విద్యార్థులతోను కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఈ నెల 24వ తేదీలోపు ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌తోపాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే ఎపి నిట్‌లో సీట్లు కేటాయింపు పొందిన విద్యార్థులు ఆగస్టు మొదటి వారంలో ఎపి నిట్‌ ప్రాంగణానికి వచ్చి తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ (పరిశీలన) చేయించుకోవాల్సి ఉంటుందని, దీనికి ప్రత్యేక కేంద్రాన్ని ఇప్పటికే సిద్ధం చేశామని ఆయన తెలిపారు.

➡️