రక్షణ చట్టంపై అవగాహన కల్పించాలి

సివిల్‌ జడ్జి జి.గంగరాజు

ప్రజాశక్తి – నరసాపురం

పిల్లలను రక్షించడానికి రక్షణ చట్టంపై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని సివిల్‌ జడ్జ్‌(సీనియర్‌ డివిజన్‌) జి.గంగరాజు అన్నారు. నేడు అంతర్జాతీయ తప్పిపోయిన బాలల దినోత్సవం సందర్భంగా నర్సాపురం మండల న్యాయ సేవాధికారా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు చల్లా దానయ్య నాయుడు అధ్యక్షతన డ్వాక్రా మహిళలకు న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా సివిల్‌ జడ్జి(సీనియర్‌ డివిజన్‌) జి.గంగరాజు పాల్గొని మాట్లాడారు. 1983లో ప్రారంభమైన ఈ ప్రత్యేక దినాన్ని ప్రతి సంవత్సరం మే 25న జరుపుకోవడం పరిపాటన్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 96 వేల పిల్లలు అపహరణకు గురవుతున్నారన్నారు. పిల్లలను రక్షించడానికి రక్షణ చట్టంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఉన్నత న్యాయస్థానాలు ప్రత్యేక దృష్టి పెట్టాయన్నారు. పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో, స్కూల్‌లో వారి ప్రవర్తన ఎలా ఉందో తరచూ తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం పిల్లలు ఎక్కువగా సోషల్‌ మీడియాకు ప్రభావితులై తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోతున్నారన్నారు. బాలికలను అపహరించి, అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. చిన్నతనం నుంచి పిల్లలకు మంచి, చెడు నేర్పించాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల కుటుంబ బాంధవ్యాలపై బాధ్యత ఉంటుంది. ఒంటరిగా ఎవరైనా పిల్లలు అనుమానాస్పదంగా కనిపిస్తే 1098కి కాల్‌ చేస్తే శిశు గృహ డిపార్ట్మెంట్‌ వారు వారికి వసతి కల్పిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు చల్లా దానయ్య నాయుడు, జనరల్‌ సెక్రటరీ ఆర్‌జి.కుమార్‌, చిట్టి పద్మజ, కార్యవర్గ సభ్యులు, ప్యానల్‌ లాయర్‌లు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

తణుకు: తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలని, తల్లిదండ్రుల్లో ఐక్యత లేకపోవుట వల్ల పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోతున్నారని తణుకు ప్యానెల్‌ న్యాయవాదులు అన్నారు. శనివారం ఇంటర్నేషనల్‌ మిస్సింగ్‌ చిల్డ్రన్స్‌ డే సందర్భంగా న్యాయవిజ్ఞాన సదస్సులో నాల్గవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి ఆదేశాల మేరకు కొండాలమ్మ గుడి రోడ్డులో ఉన్న స్లమ్‌ ఏరియా కాలనీ వాసులకు, తల్లిదండ్రులకు ప్యానెల్‌ న్యాయవాదులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ కొన్ని కుటుంబాల్లో ఆర్థికపరమైన కారణాల వల్ల పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోతున్నారని, కొంత మంది చెడు స్నేహాల వల్ల ఇల్లు విడచి వెళ్లి జీవితాలు పాడు చేసుకుంటున్నారని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. కొంతమంది ముఠాలుగా ఏర్పడి పిల్లలను అపహరించి కుంటి వారిగా, గుడ్డి వారిగా చేసి భిక్షాటన చేయిస్తారని, అట్లాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండి పిల్లల్ని రక్షించుకోవాలని సూచించారు. ఎవరైనా పిల్లలు రైల్వే స్టేషన్‌, బస్‌ స్టాండ్‌లలో అనుమానాస్పదంగా ఎదురుపడితే వెంటనే 1098 చైల్డ్‌ లైన్‌కు, 100 పోలీసులకు తెలియజేయాలని, గుర్తించిన పిల్లలను చిల్డ్రన్‌ హోంలకు తరలించి తదుపరి తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుందన్నారు. పిల్లలను పనిలో పెట్టుకొనుట, పనులు చేయించడం నేరమని అట్లాంటి వారికి జరిమాన, జైలు శిక్ష ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎ.అజరుకుమార్‌, టి.సత్యనారాయణరాజు, ముప్పిడి సుబ్బుయ్య, కౌరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️