డాలర్ల పంటకు డీజిల్‌ దెబ్బ..!

ప్రజాశక్తి – నరసాపురం

జిల్లాలో ఎన్నికల కమిషన్‌ ఆంక్షల నేపథ్యంలో పెట్రోల్‌ బంకుల్లో ప్లాస్టిక్‌ బాటిళ్లు, డబ్బాలు, టిన్నుల్లో పెట్రోల్‌, డీజిల్‌ పోయరాదని పోలీసు శాఖ ఆదేశించింది. జిల్లాలోని అన్ని పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలకు, పోలీసులు ఇప్పటికే నోటీసులు అందజేశారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన ఎన్నికల కమిషన్‌ ఎలక్షన్‌ కోడ్‌ పూర్తయ్యే వరకూ కొన్ని రోజులు పెట్రోల్‌ బంకులకు వచ్చే వాహనాలకు మాత్రమే పెట్రోల్‌ కొట్టాలని, విడిగా ఎవరైనా వచ్చి పెట్రోల్‌, డీజిల్‌ అడిగితే వారి వివరాలు పోలీస్‌స్టేషన్‌కు ఇవ్వాలని పోలీసు శాఖ కోరింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్‌ సైతం ఆదేశించింది.వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు ఎండ, ఓ వైపు వర్షం, మరో వైపు మబ్బులుగా ఉంటోంది. ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులుగా ఉండడంతో ఆక్వా చెరువుల్లో ఆక్సిజన్‌ స్థాయి పడిపోయి రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి.ఎన్నికల వేడి నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు, దాడులను నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్‌ పెట్రోల్‌ బంకుల్లో లూజుగా పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలను నిలిపివేస్తూ అన్ని బంకులకు ఇచ్చిన ఆదేశాలు ఆక్వా రైతుల పాలిటశాపంగా మారింది. జిల్లాలో గొడవలు జరగకపోయినా ఇసి ఆదేశాలను ఉన్నతాధికారులు, పోలీసులు కఠినంగా అమలు చేయడంతో అన్ని బంకుల్లో లూజు విక్రయాలను నిలిపివేశారు. వాహనాల్లో మినహా టిన్నుల్లో, డబ్బాల్లో పెట్రోల్‌, డీజిల్‌ వేయడం ఆపేశారు. చేపల చెరువుల్లో చేపలు, రొయ్యలకు ఆక్సిజన్‌ అందించేందుకు ఏరియేటర్లను ఏర్పాటు చేస్తారు. జిల్లాలో సుమారు 150 పైగా పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. భీమవరం, ఉండి, ఆకివీడు, కాళ్ల, గణపవరం, మొగల్తూరు, నరసాపురం, పాలకొల్లు, యలమంచిలి తదితర ప్రాంతంల్లో ఎక్కువగా ఆక్వా సాగవుతోంది. జిల్లాలో సుమారు 49,040 ఎకరాల్లో రైతులు రొయ్యల సాగు చేపట్టారు. సుమారు లక్ష ఎకరాలకుపైగా రొయ్యలు, చేపల సాగు చేపట్టారు. ఏటా జిల్లా నుంచి 15 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆక్వా ఎగుమతులు జరుగుతున్నాయి. ఏడాదికి 14 వేల కోట్లకుపైగా ఆదాయం తెచ్చిపెడుతోంది. చెరువుల్లో కరెంటు మోటార్ల ద్వారా ఏరియేటర్లు నడపగా మరికొన్ని చెరువుల వద్ద ఆటో ఇంజిన్లతో నడుపుతున్నారు. ఆటో ఇంజిన్లు డీజిల్‌తో తిరుగుతాయి. కరెంటు మోటార్లు ఉన్నచోట కరెంట్‌ పోయినప్పుడు జనరేటర్ల సాయంతో మోటార్లను తిప్పుతారు. దీంతో ఆక్వా రైతులకు డీజిల్‌ వాడకం ఎక్కువగా ఉంటుంది. సగటున ఎకరం చెరువు ఉన్న రైతు 20 లీటర్ల డీజిల్‌ వాడుతుంటాడు. ఈ డీజిల్‌ను టిన్నుల్లో నింపుకొని చెరువుల వద్దకు తీసుకెళ్తారు. తాజాగా ఇసి ఇచ్చిన ఆదేశాలతో బంకుల్లో లూజుగా డీజిల్‌ ఇవ్వకపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డీజిల్‌ ఇవ్వకుంటే ఏరియేటర్లు తిరగక ఆక్సిజన్‌ అందక తమ పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో చేపలు, రొయ్యలకు ప్రతి నిమిషమూ ఆక్సిజన్‌ అందించడం తప్పనిసరి అని, ఏరియేటర్లు ఆగిపోతే వెంటనే చేపలు, రొయ్యలు మృత్యువాత పడతాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల గొడవలు లేని ఈ ప్రాంతంలో ఉన్నతాధికారులు డీజిల్‌ వరకైనా మినహాయింపు ఇవ్వాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. చాలా గ్రామాలు, పట్టణాల్లో కిరాణా దుకాణాలు, కూల్‌ డ్రింక్‌ షాప్‌ల వద్ద నిత్యం పెట్రోల్‌, డీజిల్‌ అమ్ముతారు. అనుకోకుండా చాలా మంది ద్విచక్ర వాహనాలకు పెట్రోల్‌ అయిపోవడంతో షాపుల వద్ద కొనుగోలు వాడతారు. ప్రస్తుతం దుకాణాల వద్ద పెట్రోల్‌ లేకపోవడంతో కిరణాషాపుల వద్ద రేట్లు సైతం పెంచేశారు. పెట్రోల్‌ అయిపోయిన వాహనదారులు బంకు వరకూ వాహనం నడిపించుకుంటూ వెళ్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే భారీగా పెట్టుబడి పెట్టామని చివరి దశలో ఏరియటర్లు తిరగక ఆక్సిజన్‌ అందకపోతే రొయ్యలు తేలిపోతాయని, దీంతో తీవ్రంగా నష్టపోతామని ఆక్వా రైతులు ఆవేదన చెందుతున్నారు. నిత్యం డీజిల్‌ కొనే రైతులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వివరాలు తెలిపితే విచారించి, వారికి డీజిల్‌ కొట్టేలా చర్యలు చేడతామని పోలీస్‌ సిబ్బంది తెలుతున్నారు. నిత్యం కొనే ఆక్వా రైతులకు డీజిల్‌ కొట్టేలా చర్యలు చేపట్టాలని ఆక్వారైతులు కోరుతున్నారు. కొన్నిచోట్ల తక్కువ మొత్తంలో డీజిల్‌ కొడుతున్నట్లు సమాచారం.

➡️