18 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

ప్రజాశక్తి – భీమవరం

సాధారణ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని, నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నామినేషన్‌ ప్రక్రియ ఈ నెల 18 నుంచి ప్రారంభమై 25వ తేదీతో ముగుస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 26న అభ్యర్థుల నామినేషన్‌ పత్రాల పరిశీలన, 29న నామినేషన్‌ పత్రాల ఉపసంహరణతో ముగుస్తుందని పేర్కొన్నారు. మే 13న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. 1,463 పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, ర్యాంప్‌, విద్యుత్‌, మరుగుదొడ్ల సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. 120 శాతం ఇవిఎం యంత్రాలు సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని, వాటి వద్ద వెబ్‌ క్యాస్టింగ్‌, అబ్జర్వర్ల నిఘా ఉంచామని తెలిపారు. సర్వీస్‌ ఓటర్లు, విధుల్లో ఉండే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓట్లు వినియోగించుకునే అంశాలపై అన్ని చర్యలూ తీసుకునామని తెలిపారు. నామినేషన్‌ సమయంలో అభ్యర్థులకు మూడు వాహనాలకే అనుమతి ఉందని తెలిపారు. ఆర్‌ఒ కార్యాలయానికి వంద మీటర్ల వరకూ మాత్రమే వాహనాలకు అనుమతి ఉందని పేర్కొన్నారు. నామినేషన్‌ సమయంలో అభ్యర్థులతోపాటు మరో నలుగురు మాత్రమే లోపలికి వెళ్లడానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఒక్కో అభ్యర్థి నాలుగు నామినేషన్‌ పత్రాలు వేయడానికి అవకాశం ఉందని తెలిపారు. అఫిడవిట్‌, ఓటు ధ్రువీకరణ పత్రం, పార్టీ బలపరిస్తే సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్‌ ఖాతాలు నామినేషన్‌తో పాటు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. అభ్యర్థిపై క్రిమినల్‌ కేసులు ఉంటే పత్రికలు, చానల్స్‌ లలో ముందస్తుగా ప్రకటన ఇవ్వాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేయడానికి ప్రతి మండలానికి టీంలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సెక్టార్‌ అధికారుల టీంలు జిల్లాలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. సీజర్‌ మేనేజ్మెంట్‌లో నగదు, అక్రమ మద్యం సీజ్‌ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల పోటీలో ఉండే అభ్యర్థులు పత్రికలు, టీవీ ఛానల్స్‌లో తమ ప్రచారాలకు ఎంసిఎంసి కమిటీ వద్ద ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా కరపత్రాలు ముద్రించినా, ప్రచారాలకు యాడ్స్‌ ఇస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద కేసులు నమోదయ్యాయని తెలిపారు. నగదు తరలించే అంశాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

➡️