విద్యార్థుల డ్రాపవుట్లు సహించను

ప్రజాశక్తి – వీరవాసరం

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలు తన దృష్టికి తీసుకురావాలని, వాటిని భర్తీ చేయించే బాధ్యత తనదని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఏఒక్క విద్యార్థీ డ్రాపవుట్‌ అయితే మాత్రం సహించేది లేదని భీమవరం ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. స్థానిక ఎంఆర్‌కె జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో గురువారం స్టూడెంట్‌ కిట్స్‌ పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఇఒ శ్రీమన్నారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ విద్యకు మొదటి ప్రాధన్యత ఇవ్వాలన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు విద్యకు పెద్దపీట వేస్తున్నాయన్నారు. పదో తరగతిలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయుల బోధన ఉండాలన్నారు. ఉన్నత విద్యకు ఆర్థిక ఇబ్బందులు పడే విద్యార్థుల వివరాలు తన దృష్టికి తీసుకొస్తే దాతల సహకారం చేకూరుస్తానన్నారు. పాఠశాలకు రాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారిని పాఠశాలకు రప్పించే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలంటే తక్కువ భావం ఉండకూడదన్నారు. ప్రయివేటు పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే పోటీదారులనే ఆలోచనతో విద్య అభ్యసించాలన్నారు. ప్రజలైనా, ఉద్యోగులైనా తమ సమస్యలను పరిష్కరించుకోవాడానికి నిరభ్యంతరంగా తన వద్దకు రావచ్చునన్నారు. కక్షలు, ప్రతికారచర్యలు ఉండవన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి వార్డు తిరిగి సమస్యలు గుర్తించి అభివృద్ధి చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలబెడతానన్నారు. గత ప్రభుత్వం రైతాంగ సమస్యలు పట్టించుకోలేదని, దీంతో మురుగు, పంట కాల్వల్లో తూడు పేరుకుపోవడం వల్ల పంట పొలాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, ఈ సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు చేపడతానన్నారు. ఎంపిపి వీరవల్లి దుర్గాభవాని మాట్లాడుతూ పాఠశాలల విలీనానికి తీసుకొచ్చిన జిఒ నెం.117ను రద్దు చేసేలా ఎంఎల్‌ఎ కృషి చేయాలన్నారు. ఎంఆర్‌కె హైస్కూల్‌ పూర్వ విద్యార్థుల అసోసియేషన్‌ అధ్యక్షుడు గుండా రామకృష్ణ మాట్లాడుతూ గ్రామంలో గత టిడిపి ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి నిలిచిపోయిన అన్న క్యాంటీన్‌, రైతుబజార్‌, ఎంఆర్‌సి భవన నిర్మాణాలతోపాటు వీరవాసరంలో అసంపూర్తిగా ఉన్న డ్రెయినేజీ, రాయకుదురు హైస్కూల్‌ గ్రౌండ్‌ మెరక చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఎల్‌ఎను కోరారు. జెడ్‌పిటిసి గుండా జయప్రకాష్‌నాయుడు మాట్లాడుతూ ప్రజల సొమ్మును ప్రజల సంక్షేమానికే ఖర్చు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ ప్రాధాన్యత ఇస్తారన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపిలు అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, చిలకపాటి ప్రకాశం, ప్రధానోపాధ్యాయుడు జుత్తిగ శ్రీనివాస్‌, సర్పంచులు వేండ్ర లీలావెంకటకృష్ణ, కారిపెల్లి శాంతిప్రియ, పులపర్తి ప్రశాంత్‌, ఎంపిడిఒ విజయసారధి, కోళ్ల నాగేశ్వరరావు, ఎంఇఒ రాజేష్‌, ఎంపిటిసిలు కొల్లేపర శ్రీనివాసరావు, యాళ్లబండి ఇందిర, నాయకులు వీరవల్లి చంద్రశేఖర్‌, జవ్వాది బాలాజీ, కోడి నర్సింహులు పాల్గొన్నారు.

➡️