బొబ్బిలి రాజా ఎవరు?

May 5,2024 20:58

సార్వత్రిక ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గంలో నువ్వా నేనా? అన్నట్లు పోటీ నెలకొంది. నియోజకవర్గం నుంచి 8మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రచారంలో మాత్రం వైసిపి, టిడిపి, కాంగ్రెస్‌ ముందంజలో ఉన్నాయి. ప్రచారంలో మూడు పార్టీలు ముందున్నప్పటికి వైసిపి, టిడిపి అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఆ రెండు పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే విధంగా కాంగ్రెస్‌ ప్రయత్నం చేస్తోంది. నియోజకవర్గంలో వైసిపి, టిడిపిలకు మంది మార్బలం ఉన్నప్పటికీ వారికి దీటుగానే కాంగ్రెస్‌ ప్రచారంలో ముందుకు వెళ్తోంది. వాటితోపాటు బిఎస్‌పి, ఎస్‌పి, జైభీమ్‌ రావ్‌ భారత్‌ పార్టీతో పాటు ఇద్దరు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన మూడు పార్టీలు మాత్రమే ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పటికీ మిగిలిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఎక్కడా ప్రచారం చేసినట్లు కనిపించడం లేదు. వైసిపి, టిడిపి ఎత్తుకు పైఎత్తులు వేసి గెలుపు కోసం పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్‌ మాత్రం నియోజకవర్గంలో బలోపేతం అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. 

ప్రజాశక్తి-బొబ్బిలి: బొబ్బిలి నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా శంబంగి వెంకట చినప్పలనాయుడు, టిడిపి అభ్యర్థిగా బేబినాయన, ఇండియా కూటమి మద్దతుతో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మరిపి విద్యాసాగర్‌ పోటీ చేస్తున్నారు. శంబంగి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉంది. 1999లో పెద్దింటి జగన్మోహనరావు, 2004, 2009, 2014 ఎన్నికల్లో సోదరుడు సుజయకృష్ణ రంగారావు విజయంలో బేబినాయన కీలకపాత్ర పోషించారు. ఒకసారి మున్సిపల్‌ చైర్మన్‌గా పని చేసిన అనుభవమూ ఉంది. సంక్షేమం, అభివృద్ధిపై నమ్మకంఎమ్మెల్యే శంబంగి.. వైసిపి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి ఎన్నికల్లో విజయతీరానికి చేరుస్తాయని భావిస్తున్నారు. తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే శంబంగితోపాటు ఆయన కుమారుడు శ్రీకాంత్‌, సోదరుడు శంబంగి వేణుగోపాలనాయుడు ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారంటిడిపి అభ్యర్థి బేబినాయన.. వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తన సోదరుడు సుజయకృష్ణ రంగారావు చేసిన అభివృద్ధి పనులను, తాను చేసిన సామాజిక కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయనతోపాటు మాజీమంత్రి, ఆయన సోదరుడు సుజయకృష్ణ, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. జనసేన, బిజెపి నాయకులు కూడా వెన్నంటి ఉంటూ బేబినాయన విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. ధీటుగా ప్రచారంకాంగ్రెస్‌ అభ్యర్థి విద్యాసాగర్‌కు రాజకీయ అనుభవం పెద్దగా లేదు. అయినా ప్రచారంలో ఎక్కడా వెనుకంజ వేయడం లేదు. కాంగ్రెస్‌ హయాంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. వైసిపి, టిడిపి వైఫల్యాలను ప్రజలకు చెప్పి ఇండియా కూటమి అభ్యర్థి విద్యాసాగర్‌ ఓట్లను అడుగుతున్నారు. విద్యాసాగర్‌కు వామపక్షాల నాయకులు, మేధావులు మద్దతునిస్తున్నారు. త్రిముఖ పోటీలో వైసిపి, టిడిపి అభ్యర్థుల మధ్య గట్టిపోటీ నెలకొనగా ఆ రెండు పార్టీలకు పోటీ ఇచ్చేందుకు ఇండియా కూటమి పని చేస్తోంది. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఎవరికి ఓట్లు వేసి బొబ్బిలి రాజాను చేస్తారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.

➡️