గెలుపుపై ఎవరి ధీమా వారిదే..!

భీమిలి నియోజకవర్గం

భీమిలిలో 75.96 శాతం పోలింగ్‌

నవరత్నాలుపైనే వైసిపి విశ్వాసం

ప్రభుత్వంపై వ్యతిరేకత, సూపర్‌ సిక్స్‌ పథకాలపై టిడిపి గంపెడాశలు

కూడికలు, తీసివేతల్లో ప్రధాన పార్టీల నేతలు

ప్రజాశక్తి -భీమునిపట్నం : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్‌రూంల్లోని ఇవిఎంలలో నిక్షిప్తమై ఉంది.వచ్చేనెల 4న కౌంటింగ్‌కు మరో 20రోజుల గడువు ఉండనే ఉంది. ఈలోగా పోటీ అభ్యర్థులు, వారిని బలపరిచిన పార్టీశ్రేణులు, అభిమానులు ఎవరికి వారే పోలింగ్‌ సరళిని సమీక్షిస్తూ గెలుపు అంచనాలపై లెక్కలు వేసుకుంటున్నారు. లోలోన గుబులు ఉన్నా, పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలో ఈనెల 13న జరిగిన ఎన్నికల్లో 75.96 శాతం పోలింగ్‌ నమోదైంది. 2019లో 73.90 శాతం నమోదైంది.గతం కంటే ప్రస్తుతం 2 శాతం పెరిగింది. నియోజక వర్గంలో మొత్తం ఓటర్లు 3లక్షల63 వేల 13 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2 లక్షల 75 వేల 747మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇందులో మహిళలు లక్ష 40 వేల 446 మంది, పురుషులు లక్ష 35 వేల 301 మంది ఓటేశారు. గతం కంటే అధికంగా పోలింగ్‌ నమోదు కావడం, ముఖ్యంగా మహిళా ఓట్లు ఎక్కువగా పోలవ్వడం అది తమ విజయానికి సంకేతమని అటు వైసిపి, ఇటు టిడిపి ఎవరికి వారే ధీమా వ్యక్తం జేస్తున్నాయి. సంక్షేమ పథకాలపై వైసిపి విశ్వాసంభీమిలి నియోజక వర్గంలో పోలింగ్‌శాతం గతం కంటే ఎక్కువగా 71.14 శాతం నమోదు కావడం, అందులోనూ మహిళా ఓటర్లు పెద్దసంఖ్యలో ఓట్లేయడంతో వైసిపిపై గెలుపుపై ఆశలు పెంచాయి. నవరత్న పథకాలను ఎక్కువగా మహిళా లబ్ధిదారుల పేరునే ఇవ్వడంతో వారంతా తమకే ఓటు వేసి ఉంటారన్న వైసిపి గట్టినమ్మకంతో ఉంది.అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, ఇబిసి నేస్తం, డ్వాక్రా సున్నా వడ్డీ, జగనన్న ఇల్లు, రైతుభరోసా, ఆరోగ్యశ్రీ, విద్యా, వసతిదీవెన వంటి సంక్షేమ పథకాలు తమకు ఓట్లు తెచ్చి పెడతాయని అధికార వైసిపి నేతలు, గ్రామస్థాయి నేతలు, కార్యకర్తలు లెక్కలు వేస్తున్నారు. 2024 మ్యానిఫెస్టోతో యువతలో కొత్త ఆశలు చిగురించాయని, కొత్తగా ఓటు వేసిన వారంతా తమ వెన్నంటే ఉన్నారని అంటున్నారు.సూపర్‌ సిక్స్‌ పథకాలపై గంపెడాశలో టిడిపి..ఓటింగ్‌ సరళి చూస్తే ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. 2024 ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలు తమను గెలిపిస్తాయని టిడిపితో సహా కూటమి నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఏటా మూడు ఉచిత వంటగ్యాస్‌ సిలెండర్లు, మహిళలకు ఉచిత ఆర్‌టిసి బస్సు ప్రయాణం, 18ఏళ్లు నిండిన మహిళలకు ప్రతినెలా రూ.1500 వంటి పథకాలను మహిళలు స్వాగతించారని, కూటమిపార్టీలకే ఓటేశారనడానికి పోలింగ్‌ సరళి తేటతెల్లం చేస్తుందని అంటున్నారు. యువతకు నెలసరి నిరుద్యోగభృతి రూ.3వేలు, 20లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వంటివి యువతను ఆకర్షించి, కూటమికి ఓట్లేసేలా చేశాయని లెక్కలు వేస్తున్నారు. రైతులకు ఏటా రూ.20వేలు పెట్టుబడి సాయం గ్రామీణ ప్రాంతంలో రైతుకుటుంబాలు ఓట్లేసేలా చేసిందని, ఇక ప్రతి విద్యార్థికి రూ.20వేలు విద్యాసాయం అందరినీ మెచ్చేలా చేసిందన్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు పోలింగ్‌ సమయం ముగిసిన తర్వాత కూడా రాత్రి వేళల్లోనూ క్యూలైన్లలో నిల్చోబెట్టి కూటమికి ఓట్లు తెచ్చిపెట్టిందని అంటున్నారు.

➡️