నల్లమల అడవిలోకి వన్యప్రాణులు

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: కాకినాడలోని నాగార్జున ఫర్టిలైజర్స్‌ ఆధ్వర్యంలో పెంచుతున్న 25 చుక్కల దుప్పులు, 28 కణుతులను ఆదివారం రాత్రి అటవీ శాఖ సిబ్బంది ఆరీఫ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో పెద్దదోర్నాల మండలంలోని చట్లగుండం, పెద్దచెరువు, పచ్చర్ల ప్రాంతాలలో వీటిని వదిలారు. ఈ సందర్భంగా మార్కాపురం డిఎఫ్‌వో విఘ్నేష్‌ అప్పావు మాట్లాడుతూ మూడు ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ కంచె వేసి అందులో వీటిని పెంచనున్నట్లు తెలిపారు. కొంతకాలం తర్వాత దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వీటిని వదిలేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో 80 పెద్ద పులులు ఉన్నాయన్నారు. అడవిని, అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్‌ డిఎఫ్‌వో ఆత్మకూరు వేణు, ఐఎఫ్‌ఎస్‌ ట్రైనింగ్‌ అధికారి శివకుమార్‌ గంగల్‌, ఎఫ్‌ఆర్వో విశ్వేశ్వరరావు, ఆరీఫ్‌ ఖాన్‌, అటవీ సిబ్బంది ఉన్నారు.

➡️